హైదరాబాద్‌కు వేదిక మార్పు
ఇదే వేదికపై ముగింపు సభ..
నేటి సీఎం బహిరంగ సభ వాయిదా
హైదరాబాద్‌లోనే ‘రైతు భరోసా’ నిధులు విడుదల
రైతుభరోసా పంపిణీ పూర్తయ్యాక మత్కేపల్లిలో ముగింపు సభ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం / చింతకాని: చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం జరగాల్సిన రైతు ఆశీర్వాద సభకు వర్షం అడ్డంకిగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనాల్సిన ఈ సభాప్రాంగణం రెండు రోజులుగా కురిసిన వర్షంతో చిత్తడిగా తయారైంది. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో సభ, రైతుమేళా, సీఎం కాన్వాయ్ కోసం కేటాయించగా.. వాహనాల పార్కింగ్‌తో కలిపి మొత్తంగా 150 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే కురిసిన వర్షంతో తొలుత రెండు రోజులు జరగాల్సిన రైతుమేళా రద్దు చేశారు. ఇక సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించి సభ నిర్వహించడం సాధ్యం కాదని తేల్చడంతో మంగళవారం నాటి సభ కూడా రద్దయింది. అయితే మంగళవారం హైదరాబాద్‌లో రైతుభరోసా నిధులను సీఎం విడుదల చేయనుండగా, నిధుల పంపిణీ పూర్తయ్యాక ముగింపు సభ చింతకాని మండలంలో ఎంపిక చేసిన స్థలంలో నిర్వహించాలని నిర్ణయించారు.
భారీగా ఏర్పాట్లు..
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఆశీర్వాద సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ వేదిక పైనుంచి సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రూ.9 వేల కోట్ల మేర రైతుభరోసా నిధులు విడుదల చేస్తారని ప్రకటించారు. ఇందుకోసం 2 లక్షల మంది రైతులు, ప్రజలు పాల్గొనేలా కార్యాచరణ రూపొందించారు. వారం రోజులుగా ఏర్పాట్లు చకచకా చేపట్టారు. తొలుత ఆది, సోమవారం రైతు మేళా జరుగుతుందని.. మంగళవారం రైతు ఆశీర్వాద సభ నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే, వర్షంతో రైతుమేళాను ఒకే రోజుకు కుదించినా పరిస్థితి చక్కబడకపోవడంతో మొత్తంగా రద్దు చేశారు. ఇక సభా ప్రాంగణంలో బురద పేరుకుపోవడం, వర్ష సూచనలు ఉండడంతో సభ సైతం వాయిదా పడింది.
ఏ మాత్రం అవకాశం ఉన్నా రైతు ఆశీర్వాద సభ నిర్వహించాలని అధికారులు, మంత్రులు భావించారు. కానీ ఆదివారం భారీ వర్షం కురవడంతో సభ నిర్వహణకు అవకాశాలు సన్నగిల్లాయి. ఫలితంగా సోమవారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలాంచాక సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు మత్కేపల్లిలో జరగాల్సిన సభ వాయిదా పడిందని ప్రకటించారు. అయితే, రైతుభరోసా నిధుల విడుదల మాత్రం వాయిదా వేయకుండా, హైదరాబాద్ శిల్పకళావేదికలో మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదలకు నిర్ణయించారు.
జిల్లా నుంచి రైతుభరోసా నిధుల విడుదల కోసం బహిరంగ సభ నిర్వహించాలని భావించినా సాధ్యం కాలేదు. దీంతో మత్కేపల్లిలో ఎంపిక చేసిన స్థలంలోనే మరో సభ నిర్వహిస్తామని ప్రకటించారు. రైతుభరోసా నిధుల పంపిణీ పూర్తయ్యాక ముగింపు సభ ఇక్కడ నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. రైతుభరోసా నిధులు మంగళవారం నుంచి విడుదల చేయనుండగా.. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు జమ చేస్తారు. ఆపై వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జూలై 6, 7 లేదా 8వ తేదీల్లో ఒకరోజు మత్కేపల్లిలోనే సభ నిర్వహించాలని నిర్ణయించారు.
వర్షంతో చిత్తడిగా మారిన సభా ప్రాంగణం


