ఐదుగురు విద్యార్థులు.. ఇద్దరు ఉపాధ్యాయులు | - | Sakshi
Sakshi News home page

ఐదుగురు విద్యార్థులు.. ఇద్దరు ఉపాధ్యాయులు

Jun 30 2026 12:54 AM | Updated on Jun 30 2026 12:54 AM

ములకలపల్లి: మండల పరిధిలోని చాపరాలపల్లి జీపీ కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాల (యూపీఎస్‌)లో ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. సోమవారం నలుగురు చిన్నారులు మాత్రమే పాఠశాలకు హాజరయ్యారు. వీరందరూ బాలికలే కావడం గమనార్హం. ఏడో తరగతి వరకూ ఉన్న ఈ పాఠశాలలో ఇద్దరు టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది 13 మంది చిన్నారులుండగా, ముగ్గురు విద్యార్థులకు గురుకులంలో ఐదో తరగతిలో సీట్లు వచ్చాయి. మరో ఐదుగురు విద్యార్థులు పాఠశాలకు రావడంలేదు. ఐదుగురు బాలికలే బడికి వస్తుండగా, ఇద్దరు ఉపాధ్యాయలు పాఠాలు బోధిస్తున్నారు.

గాలి దుమారంతో

విరిగిపడిన చెట్లు

అశ్వారావుపేటరూరల్‌: మండలంలోని వినాయకపురం, వినాయకపురం కాలనీ, తిరుమలకుంట, ఆసుపాక, నందిపాడు, పండువారిగూడెం గ్రామాల్లో సోమవారం గాలి దుమారం బీభత్సం సృష్టించింది. భద్రాచలం–రాజమండ్రి మార్గం, వినాయకపురం అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారుల్లో చెట్లు విరిగి పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

‘పల్స్‌ పోలియో’ను పరిశీలించిన రాష్ట్ర బృందం

చుంచుపల్లి: జిల్లాలో నిర్వహిస్తున్న పల్స్‌ పోలియో ఇంటింటి సర్వేకార్యక్రమాన్ని రాష్ట్ర పర్యవేక్షణ అధికారి బ్రహ్మానందరావు బృందం సోమవారం పరిశీలించింది. కొత్తగూడెం పట్టణంలోని సఫాయి బస్తీ, పాల్వంచ ఆర్టీసీ బస్టాండ్‌, బొల్లొరిగూడెం, ఆళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గొత్తికోయ గిరిజన ఆవాస ప్రాంతాల్లో సర్వేను సభ్యులు పరిశీలించారు. జిల్లాలో పల్స్‌ పోలియో కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహిస్తున్న తీరు ను, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి, జిల్లా శిశు ఆరోగ్య, రోగనిరోధక టీకాల అధికారి డాక్టర్‌ ప్రతాప్‌, సీహెచ్‌వో నాగభూషణం, సోమ్లానాయ క్‌, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సారా స్థావరాలపై పోలీసుల దాడి

కరకగూడెం: మండలంలోని కలవలనాగారం సమీప అటవీ ప్రాంతంలో నాటు సారా తయారీ స్థావరాలపై కరకగూడెం పోలీసులు సోమవారం దాడి చేశారు. సుమారు 500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. సారా తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement