నిమిషాల్లోనే అయిపోతుంది
యాప్‌లో స్టాక్ కనిపించిన నిమిషాల్లోనే విక్రయాలు ప్రైవేట్ డీలర్ల వద్ద అధిక మొత్తంలో యూరియా స్టాక్ అధిక ధరలకు విక్రయిస్తుండటంతో రైతులపై పెరుగుతున్న భారం
స్తంభించిన యాప్ సేవలు
బూర్గంపాడు: యూరియాను రైతులకు సులభంగా, పారదర్శకంగా విక్రయించేందుకు, వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత వ్యవసాయ సీజన్ నుంచి ఫర్టిలైజర్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. రైతులు యాప్‌లో లాగిన్ అయి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని, పీఏసీఎస్ గోదాంలు, ప్రైవేటు డీలర్ల వద్దకు వెళ్లి కొనుగోలు చేయాలి. గత వ్యవసాయ సీజన్‌లో ప్రభుత్వం పీఏసీఎస్ గోదాంలకు ఎక్కువగా, ప్రైవేటు డీలర్లకు చాలా తక్కువగా యూరియా సరఫరా చేసింది. ప్రస్తుతం మాత్రం యాప్‌లో పీఏసీఎస్ గోదాంలలో స్టాక్ తక్కువగా, ప్రైవేటు డీలర్ల వద్ద ఎక్కువగా చూపుతోంది.
డీలర్ల వద్దే ఎక్కువ ధర..
ప్రభుత్వ రాయితీతో యూరియా బస్తాను(45కిలోలు) రూ 266.50కు రైతులకు విక్రయించాలి. పీఏసీఎస్ గోదాంలలో మాత్రమే ఈ ధరకు లభిస్తుండగా, ప్రైవేటు డీలర్లు మాత్రం రూ.350కు విక్రయిస్తున్నారు. ధర ఎక్కువగా తీసుకోవటంతోపాటు రెండు, మూడు బస్తాల యూరియాకు ఇతర ఎరువులను కూడా అంటగడుతున్నారు. పీఏసీఎస్ గోదాంలలో నో స్టాక్ చూపిస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు డీలర్ల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. మార్క్‌ఫెడ్ నుంచి పీఏసీఎస్‌లకు వచ్చే యూరియాకు రవాణా ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని, తమకు వచ్చే యూరియాకు ట్రాన్స్‌ఫోర్ట్, దిగుమతుల ఖర్చులను తామే భరించాల్సి వస్తుందని ప్రైవేటు డీలర్లు పేర్కొంటున్నారు. అందువల్లే ఎక్కువ ధరకు అమ్మాల్సివస్తుందని చెబుతున్నారు.
ఎకరాకు రెండున్నర బస్తాలే..
ప్రభుత్వం యూరియా వినియోగాన్ని తగ్గించేందుకు ఒక్కో సీజన్‌లో ఎకరాకు కేవలం రెండున్నర బస్తాలు మాత్రమే అందిస్తోంది. అందుకు అనుగుణంగా ఫర్టిలైజర్ యాప్‌లో వ్యవసాయ భూమి విస్తీర్ణం ఆధారంగా వివరాలు నమోదు చేశారు. రెండెకరాల భూమి ఉంటే వానాకాలం సీజన్‌లో ఐదు బస్తాలు మాత్రమే ఇస్తారు. అది కూడా రెండు, మూడు దశల్లో బుక్ చేసుకోవాలి. యాప్‌లో రైతు పేరు, పట్టాదారు పాస్‌బుక్ నంబర్ నమోదు చేయగానే, అతనికి ఎన్ని బస్తాల యూరియాకు అర్హత కలిగి ఉన్నాడో, ఎన్ని దశల్లో బుక్ చేసుకోవచ్చో చూపిస్తుంది. యాప్‌ను పక్కాగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందరికీ ఒకే ధరకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కువ శాతం పీఏసీఎస్‌ల్లో విక్రయించాలని రైతులు కోరుతున్నారు.
జూన్ నెల రెండోవారం నుంచి జిల్లావ్యాప్తంగా యాప్ ద్వారా యూరియా విక్రయాలు ఆరంభమయ్యాయి. ఒక్కో పీఏసీఎస్ గోదాంలో 600 బస్తాలు స్టాక్ ఉన్నట్లు చూపుతుండగా, మండలాలవారీగా ఆయా గ్రామాల రైతులు నిమిషాల వ్యవధిలోనే బుక్ చేసుకుంటున్నారు. ఏమాత్రం ఆలస్యం చేసినా స్టాక్ అయిపోతుంది. అదే సమయంలో ప్రైవేటు డీలర్ల వద్ద మాత్రం వేల బస్తాల యూరియా స్టాక్ ఉన్నట్లు యాప్‌లో కనిపిస్తోంది. అయితే ప్రైవేటు డీలర్ల వద్ద కొనేందుకు రైతులు ఆసక్తి చూపటం లేదు.
సహకార సంఘాలకు తక్కువగా యూరియా సరఫరా!
ఇల్లెందురూరల్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో రైతులు వ్యసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. పత్తి విత్తనాలు మొలకెత్తగా, మొక్కలకు యూరియా వేయాల్సిన తరుణం ఆసన్నమైంది. బుక్ చేసుకుందామంటే శనివారం రాత్రి నుంచి ఫర్టిలైజర్ యాప్ పనిచేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా నిల్వలు తగ్గడం వల్లే యాప్ పనిచేయడం లేదని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యాప్ పనిచేయకపోవడానికి గల కారణాలను వ్యవసాయ శాఖ అధికారులు కూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదు. యాప్ సేవలు స్తంభించడంపై జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావును వివరణ కోరగా.. తమకు ముందస్తు సమాచారం లేదని, పీఏసీఎస్ గోదాముల్లో యూరియా నిల్వలు ఉన్నాయని తెలిపారు.


