రామయ్యకు సువర్ణ పుష్పార్చన | - | Sakshi
Sakshi News home page

రామయ్యకు సువర్ణ పుష్పార్చన

Jun 29 2026 12:29 AM | Updated on Jun 29 2026 12:29 AM

భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి చిత్రకూట మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.

రామయ్య సన్నిధిలో ప్రముఖులు

స్వామివారిని ఆదివారం తెలంగాణ ప్రభుత్వ సలహాదారు నోరి దత్తాత్రేయుడు, ఛత్తీస్‌గఢ్‌ అటవీశాఖ మంత్రి కేదార్‌ కశ్యప్‌, త్రిదండి దేవనాథ రామానుజ జీయర్‌ స్వామి వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పండితులు వేదాశీర్వచనం అందజేశారు.

గోదావరి మాతకు హారతి

భద్రాచలంటౌన్‌: భద్రాచలం పుణ్యక్షేత్రంలోని స్నానఘట్టాల వద్ద జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి సందర్భంగా ఆదివారం సాయంత్రం వరుణుడి ముత్యాల జల్లుల మధ్య గోదావరి మాతకు వైభవంగా నదీహారతి నిర్వహించారు. గణపతి పూజ, దీపోత్సవం, గోదావరి మాతకు అష్టోత్తర శతనామార్చన జరిపించారు.

స్వామివారికి తీర్థబిందె

జ్యేష్ఠాభిషేక మహోత్సవాల సందర్భంగా ఆదివారం స్వామివారికి వైభవంగా తీర్థబిందె కార్యక్రమం నిర్వహించారు.

పెద్దమ్మతల్లికి విశేషపూజలు

పాల్వంచరూరల్‌: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్‌ ద్వారా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అన్నప్రాసనలు నిర్వహించారు. ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించారు.

నేడు ప్రజావాణి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అందజేయాలని సూచించారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో కూడా ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో..

భద్రాచలం: భద్రాచలంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు సబ్‌ కలెక్టర్‌ మృణాళ్‌ శ్రేష్ఠ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

ఐటీడీఏలో గిరిజన దర్బార్‌..

భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏలో సోమవారం గిరిజన దర్బార్‌ నిర్వహించనున్నట్లు పీఓ రాహుల్‌ ఆదివారం ప్రకటనలో తెలిపారు. గిరిజనులు తమ సమస్యలపై దరఖాస్తుల అందించాలని , అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరు కావాలని కోరారు.

కిన్నెరసానిలో

పర్యాటక సందడి

పాల్వంచరూరల్‌: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు. జలాశయం, డీర్‌పార్కులోని దుప్పులను వీక్షించారు. 651 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా రూ.42,170, సఫారీ వాహనాల ద్వారా రూ.16,200 వైల్డ్‌లైఫ్‌ శాఖకు ఆదాయం లభించింది. 360 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్‌ సంస్థకు రూ.19,290 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు కుటుంబ సభ్యులతో కలిసి కిన్నెరసానిని సందర్శించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement