జిల్లాలోని ఓటర్ల వివరాలు
● పత్రాలు ఎలా నింపాలో తెలియక ఓటర్ల ఆందోళన ● 2002లో ఓటుహక్కు ఎక్కడ ఉన్నది తెలియక అవస్థలు ● జిల్లాలో మందకొడిగా సాగుతున్న సర్ ప్రక్రియ
చుంచుపల్లి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ఈ నెల 25 నుంచి మొదలుకాగా బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ పత్రాలు అందజేస్తున్నారు. మ్యాపింగ్ ప్రక్రియలో అక్కడక్కడా జరిగిన లోపాలతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. బీఎల్‌ఓలు పూర్తిస్థాయిలో ఇంటింటికి తిరిగి సరిగ్గా మ్యాపింగ్ చేయకపోవడంతో ఓటర్లకు 2002లో తమ ఓటు హక్కు ఎక్కడున్నదో తెలియక అవస్థ పడుతున్నారు. బీఎల్‌ఓలు ఎన్యుమరేషన్ పత్రాలు ఇచ్చి వెళ్తున్నారే తప్ప అవగాహన కల్పించడం లేదు. దీంతో అవి ఎలా పూరించాలో కూడా ఓటర్లకు అర్థం కావడం లేదు. 2002 జాబితాలో ఓటు హక్కు వివరాలు తెలుసుకోవడం సమస్యగా మారింది. నిరక్షరాస్యులైన వృద్ధులు ఏమీ పాలుపోక పత్రాలు పట్టుకుని తెలిసినవారి వద్దకు పరుగులు తీస్తున్నారు. బీఎల్‌ఓలే దగ్గరుండి పూరించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. సర్ కార్యక్రమంపై అధికారులు రెండు నెలలపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో ఓటర్ల సందేహాలను నివృత్తి చేయలేకపోతున్నారు. మరికొన్ని చోట్ల వివరాల నమోదు విషయం బీఎల్‌ఓలకు సైతం తెలియకపోవడంతో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు.
బీఎల్‌ఓలకూ ఇబ్బందులు
ఓటరుకు రెండు పత్రాలు చొప్పున ఇస్తున్న బీఎల్‌ఓలు అవి పూరించాక రెండోసారి వచ్చి వాటిని తీసుకుంటారు. బీఎల్‌ఓలకు లక్ష్యం నిర్దేశించగా, పత్రాలపై క్యూఆర్ కోడ్‌ను ఫోన్‌లో స్కాన్ చేసి ఓటరుకు ఇచ్చిన వెంటనే ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేసుకుంటున్నారు. దీంతో సమాచారం ఎన్నికల అధికారులకు అందుబాటులోకి వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికి బీఎల్‌ఓ తిరగాల్సి ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంటికి తాళం వేసి ఉండటం, వలస వెళ్లడం, అద్దె ఇళ్లు మారడం వంటి కారణాలతో బీఎల్‌ఓలు వెళ్లిన సమయంలో ఓటర్లు అందుబాటులో ఉండటం లేదు. దీంతో మరోసారి వెళ్లి ఎన్యుమరేషన్ పత్రాలు ఇవ్వాల్సి ఉంది. ఇలా ఒక ఇంటికి మూడుసార్లు వెళ్లాలి. లేదంటే ఇంటి లోపల పడేయడం, పక్కింటి వారికి ఇవ్వడమో చేయాలి. జూలై 24 కల్లా కార్యక్రమాన్ని ముగించాల్సి ఉంది. ఓటర్ల జాబితా సవరణపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో స్థానిక పార్టీల నాయకులు సైతం భాగస్వాములు అవుతున్నారు. వారి సహకారంతో బీఎల్‌ఓలు వివరాలు తెలుసుకుంటున్నారు. ముద్రణ సమస్య కారణంగా ఎన్యుమరేషన్ పత్రాలు చేరకపోవడంతో రెండు రోజులుగా పత్రాల పంపిణీ ప్రక్రియ మందకొడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 35 శాతం కూడా ఫారాల పంపిణీ చేయలేదని సమాచారం.
ఎన్యుమరేషన్ ఫారాలను పూరించే విషయంలో అవగాహన లేకపోవడంతో ఆందోళన చెందుతున్నాం. చాలా మందికి ఎపిక్ నంబరు ఎలా తెలుసుకోవాలో తెలియడం లేదు. మరింతగా అవగాహన కల్పించాలి. –వినోద్, చాతకొండ
మొత్తం ఓటర్లు : 9,96,198 పోలింగ్ బూత్‌లు : 1104
పురుషులు : 4,81,251 బీఎల్‌ఓలు : 1104
మహిళలు : 5,14,877 సూపర్‌వైజర్లు : 123
ఇతరులు : 70 ఏఈఆర్వోలు : 30


