● 1వ తరగతిలో ప్రవేశించే విద్యార్థుల కోసం విద్యా ప్రవేశ్ ● 12 వారాలపాటు ‘ప్రీ ప్రైమరీ’ పాఠశాలల్లో అమలుకు ఆదేశాలు ● చాలా తక్కువ స్కూళ్లలో మాత్రమే అమలు చేస్తున్న ఉపాధ్యాయులు
ఇల్లెందు: ఇంటి వద్ద, అంగన్‌వాడీ, బాలవాటిక, ప్రీ స్కూల్‌లో ఉన్న చిన్నారులను ఒకటో తరగతిలో ప్రవేశించే విధంగా సంసిద్ధత చేసేందుకు ప్రభుత్వం విద్యా ప్రవేశ్(సంసిద్ధత) కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో ఈ ఏడాది 118 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య ప్రవేశపెట్టగా, వీటిన్నంటిలో సంసిద్ధత కార్యక్రమం అమలు చేయాల్సి ఉంది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 28 వరకు 12 వారాలపాటు 60 బోధనా దినాల్లో పూర్తి చేయాల్సి ఉంది. ప్రతీ 20 రోజులకోసారి విద్యార్థుల ప్రగతిపై మూల్యాంకనం చేయాలి. చిన్నారులు ఆనందంగా విద్యనభ్యసించేలా, సులభంగా పాఠశాల వాతావరణానికి అలవాటుపడేలా విద్యా ప్రవేశ్‌ను ప్రవేశపెట్టగా, పాఠశాలలు ప్రారంభమై పది రోజులు దాటినా చాలా పాఠశాలల్లో విద్యా ప్రవేశ్‌పై అమలు చేయడంలేదు.
ఇవీ ఉపయోగాలు
ఆట పాటల ద్వారా అభ్యాసనం చేస్తూ, శారీరక, మానసిక, సామాజిక భావోద్వేగం నుంచి పిల్లల్లో సమగ్ర వికాసం పెంపొందించడం. ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రత, పోషణ, సమర్థవంతమైన సంభాషణ, మౌఖిక భాషా నైపుణ్యాల అభివృద్ధి, మాతృభాషలో, ఇంగ్లిష్‌లో అక్షరాస్యతకు పునాది వేయడం, పరిసరాలతో అనుసంధానమైన అభ్యాసనం, సంఖ్యాజ్ఞానానికి పునాది, భౌతిక సామాజిక సహజ పరిసరాల అన్వేషణ తదితర అంశాలపై అవగాహన కల్పించడం. పాఠ్యపుస్తక బోధన కంటే సమగ్ర వికాసానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. కథలు, పాటలు, పద్యాలు, చర్చలు, పరస్పర చర్యలు, ఇండోర్, అవుట్ డోర్ ఆటలు, కళల సమన్వయంతో అభ్యాసనం చేయాలి. పాఠ్య పుస్తక బోధన, బట్టీ పట్టించటం, కాపీ రాయించటం, డ్రిల్ పద్ధతి బోధనకు అవకాశం లేదు. జిల్లాలో 118 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య ఉండగా, ఇప్పటివరకు చాలా పాఠశాలల్లో విద్యా ప్రవేశ్ ప్రారంభం కాలేదు. ఈ కార్యక్రమం అమలు బాధ్యత ప్రధానోపాధ్యాయులదే. అయితే కొందరు హెచ్‌ఎంలే అమలు చేస్తుండగా, ఎక్కువ మంది ఈ కార్యక్రమం ఊసే ఎత్తడం లేదు.
ముత్తారపు కట్ట పాఠశాలలో విద్యాప్రవేశ్ కార్యక్రమం అమలు చేస్తున్నాం. ఆట పాటలు, కథలు, గేయాలు, టీవీ కార్యక్రమాల ద్వారా విద్యార్థులను పాఠశాలకు 1వ తరగతిలో సంసిద్ధం చేస్తున్నాం. అయితే 12 వారాలపాటు సాగటం వల్ల సిలబస్ వెనుకబడి పోయే ప్రమాదం ఉంది.
– కబ్బాకుల రవి, ముత్తారపు కట్ట,
ఎంపీపీ స్కూల్, ఇల్లెందు


