● భారీ వర్షంతో చిత్తడిగా మారిన వేదిక ● సభ నిర్వహణపై నేడు నిర్ణయం
చింతకాని/ఖమ్మంసహకార నగర్: చింతకాని మండల వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం గంట పాటు కురిసిన భారీ వర్షంతో రైతు ఆశీర్వాద సభ, రైతు మేళా నిర్వహణ ఏర్పాట్లకు ఆటంకం కలిగింది. తొలుత ఆది, సోమవారం రైతు మేళా నిర్వహించాలని నిర్ణయించి చింతకాని మండలం మత్కేపల్లి వద్ద స్టాళ్ల ఏర్పాటు పనులు మొదలుపెట్టారు. అయితే, శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో శనివారం పనులు జరగకపోగా, ఆదివారం ఒక రోజు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆదివారం ఉదయం నుంచి ఏర్పాట్లు చేస్తుండగా స్టాళ్లలో వ్యవసాయ పరికరాల ప్రదర్శనకు కంపెనీల బాధ్యులు సిద్ధమయ్యారు. ఇంతలోనే సాయంత్రం గంట పాటు వర్షం దంచి కొట్టడంతో స్టాళ్ల పైకప్పులు కూలిపోవడమే కాక ఆవరణలోకి నీరు చేరింది. అక్కడకు వెళ్లే మార్గమంతా చిత్తడిగా మారింది. దీంతో రైతు మేళా సోమవారం కూడా నిర్వహించడం లేదని కలెక్టర్ దివాకర ఆదివారం రాత్రి ప్రకటించారు.
సభాస్థలి పరిశీలించాక...
మత్కేపల్లిలో బుధవారం జరగాల్సిన రైతు ఆశీర్వాద సభకు ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈమేరకు ఆదివారం మధ్యాహ్నం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆతర్వాత సాయంత్రం కురిసిన వర్షంతో సభా ప్రాంగణంలోకి నీరు చేరడమే కాక హెలీప్యాడ్, అక్కడకు వెళ్లే దారులన్నీ బురదమయ్యాయి. దీంతో సోమవారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించాక సభ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.


