ప్రతిపాదనల ఊసెత్తని అధికారులు
ఏడాదిన్నర క్రితం నాటి కలెక్టర్
ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
ఆ తర్వాత.. పట్టించుకోని అధికారులు
మణుగూరుటౌన్: ఒక వైపు సింగరేణి, మరో వైపు బీటీపీఎస్, హెవీవాటర్ ప్లాంట్, చెంతనే గోదావరి, వానాకాలం గుట్టల పైనుంచి జాలువారే జలపాతాలు, ఏడాదిపొడుగునా నిండు కుండలా దర్శనమిచ్చే పేరంటాలచెరువు, రేగులగండి, వేడి నీటి ఆవిరితో విద్యుత్ తయారీ (జియో థర్మల్) వంటి పరిశ్రమలకు, ప్రకృతి సహజ సిద్ధమైన దృశ్యాలకు నెలవైన మణుగూరులో పర్యాటక అభివృద్ధి ప్రతి పాదనలు అటకెక్కాయి. 2024 నవంబర్‌లో అప్పటి కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ మణుగూరులో పర్యటించి, గోదావరి మీదుగా భద్రాచలం పడవ ప్రయాణాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పర్యా టక అభివృద్ధికి అధికారులను ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు. ఏడాదిన్నర గడుస్తున్నా ఆ దిశగా అడుగులు పడకపోవడంతో మండల ప్రజ లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
సహజ సంపదలకు నెలవు..
పినపాక నియోజకవర్గానికి మండల కేంద్రంగా ఉన్న మణుగూరు సహజ సంపదలకు పుట్టినిల్లు. భూ అంతర్భాగంలోని బొగ్గు వెలికితీస్తూ దేశానికే వెలుగులు పంచుతూ రాష్ట్ర తలసరి ఆదాయంలో తనవంతు పాత్ర పోషిస్తోంది. చెంతనే ఉన్న గోదావరి నీటిని వినియోగిస్తూ భారజల కర్మాగారం ఏర్పాటు, స్థానికంగా లభించే బొగ్గును వినియోగించి రాష్ట్రానికి వెలుగులు పంచేందుకు ఏర్పాటు చేసిన భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, వేడి నీటి ఆవిరి నుంచి ప్రయోగాత్మక విద్యుత్ ఉత్పత్తి (జియోథర్మల్) ప్లాంట్ మణుగూరులో ఉన్నాయి. అలాగే, రేగులగండి, పేరంటాల చెరువును అభివృద్ధి చేస్తే ప్రకృతి అందాలకు సైతం కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది. విద్యార్థులకు టూరిస్ట్ స్పాట్‌గా మారుతుంది. ఎందరికో ఉపాధి కూడా కలుగుతుంది. ఇతర ప్రాంతాలకు చెందిన పర్యాటకలు ఒక్క రోజు గడిపేందుకు వానాకాలం వెన్నెల జలపాతం వద్ద పగోడాల ఏర్పాటు, పేరంటాల చెరువు, రేగులగండి చెరువులపై సైకిల్ బోట్లు, రాయిగూడెం మీదుగా మణుగూరు – భద్రాచలం పడవపై ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తుంది. ఆ దిశగా అప్పటి కలెక్టర్ దృష్టి సారించినా.. అధికారులు మారడంతో పాటు ఇప్పుడు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో పర్యాటకంపై నిరాశే మిగిలింది. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకుని పర్యాటకంపై దృష్టి సారించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.
ప్రయోజనాలు ఎన్నో..
రాయిగూడెం మీదుగా భద్రాచలం పడవ ప్రయాణాన్ని అభివృద్ధి చేస్తే భద్రాచలం ప్రజలు మణుగూరు రావాలంటే దూరభారం తగ్గుతుంది. మణుగూరులో వర్తక, వాణిజ్య, వ్యాపారాలు మరింత మెరుగుపడతాయి. 11 ఎకరాలకు ఆయకట్టుగా పేరంటాల చెరువు మత్స్యశాఖ ఇచ్చే చేపలతో పాటు పంటపొలాలకు ఆదరవుగా మారింది. బోటింగ్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయడం వల్ల సాంబాయిగూడెం గ్రామస్తులకు ఉపాధి లభిస్తుంది. పేరంటాల చెరువులో ఈతకు వెళ్లి మృత్యువాత పడినవారెందరో ఉన్నారు. అలాంటి ఘటనలకు చెక్ పెట్టడంతో పాటు ఆదివాసీ గ్రామాలకు రోడ్డు, విద్యుత్ సౌకర్యాలు మెరుగవుతాయి. వెన్నెల జలపాతం వానాకాలం కనువిందు చేస్తుండగా, పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొండపై బోరు ఏర్పాటు చేసి అన్ని కాలాల్లో జలపాతం వచ్చే విధంగా తీర్చిదిద్దాలని పలువురు కోరుతున్నారు.


