మానవ మృగాల నుంచి రక్షణ తప్పనిసరి అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం ఏ మాత్రం అనుమానం వచ్చినా ఫిర్యాదు చేస్తేనే మేలు
ఖమ్మంక్రైం: కొందరు పైకి సూటుబూటు లేదా ఖద్దరు దుస్తులు ధరించి పెద్దమనుషుల్లా చెలామణి అవుతుంటారు. ఇందులో కొందరి మనసు మాత్రం స్వచ్ఛంగా ఉండదు. ఇలాంటి ఓ వ్యక్తే ఖమ్మంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బాలికపై లైంగిక దాడి చేయడమే కాక తన తప్పు బయటపడకుండా ఆమెను భవనం పైనుంచి తోసేయడంతో తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. ఇలాంటి ఘటనలు ఉమ్మడి జిల్లాలో అక్కడకక్కడా వెలుగు చూస్తుండడంతో చిన్నారుల తల్లిదండ్రులు వణికిపోతున్నారు.
అప్రమత్తత తప్పనిసరి
అల్లారు ముద్దుగా పెంచుకునే బాలికల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. ఎవరి ఇంటికి వెళ్తున్నారు, ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరితో ఆడుకుంటున్నారనే అంశాలను నిశితంగా గమనించాలి. ముఖ్యంగా కొత్తవారి వద్దకు చిన్నారులను పంపించకపోవడమే ఉత్తమమని భావించాలి. మానవ మృగాలు అందరి మధ్యలోనే తిరుగుతున్నందున ముద్దు చేస్తున్నామని చెబుతూ చిన్నారులను దగ్గరకు తీసుకుని వెకిలిచేష్టలకు పాల్పడే ప్రమాదముంది.
వెనుకడుగు వేయొద్దు
ప్రేమ, ఆప్యాయతతో ఉన్నట్లు నటిస్తూనే చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు లేదా భరోసా సెంటర్‌లో ఫిర్యాదు చేయాలి. ఖమ్మంలోని అపార్ట్‌మెంట్‌లో బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అంతకు 15 రోజుల ముందు కూడా అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. ఆ సమయంలో నిలదీసి ఉంటే నిందితుడికి బుద్ధి చెప్పినట్లయ్యేది. అందుకే ఎవరిపై ఏ మాత్రం అనుమానం వచ్చినా తల్లిదండ్రులు అప్రమత్తమై హెచ్చరించాలి. అయినా తీరు మారకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయడమే ఉత్తమం. కాగా, ఖమ్మంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన గౌస్‌కు మొదటి నుంచి నేరచరిత్ర ఉందని తెలిసింది. కొన్నాళ్ల క్రితం మృతి చెందిన అధికార పార్టీ నేత వద్ద డ్రైవర్‌గా పనిచేసిన గౌస్ నకిలీ నక్సలైట్ అవతారం ఎత్తి డబ్బుల కోసం సదరు నేత కుమారుడినే కిడ్నాప్ చేయటానికి ప్రయత్నించి కటకటాల పాలయ్యాడు. అంతేకాక ఇంకొన్ని కేసులు కావడంతో పోలీసులు రౌడీషీట్ తెరవగా... ప్రతిపక్ష పార్టీనేతల ద్వారా రౌడీషీట్‌ను తీయించుకున్నాడని తెలిసింది.
ఈనెల 6వ తేదీ: ఖమ్మంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండే తాత వద్దకు వచ్చిన బాలికపై కన్నేసిన పైరవీకారుడైన మహ్మద్ గౌస్ లైంగిక దాడికి ప్పాడ్డాడు. అంతేకాక ఎవరికీ తెలియవద్దని ఆమెను భవనం పైఅంతస్తు నుంచి తోసేయడంతో తీవ్రగాయాల పాలైంది. దీంతో పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
ఈనెల 13వ తేదీ: అశ్వారావుపేట మండలంలోని ఓ గ్రామంలో బంధువుల ఇంటికి ఏపీ నుంచి చిన్నారి వచ్చింది. కూల్‌డ్రింక్ కొనుగోలు చేయాలని గ్రామంలోని షాప్ వద్దకు వెళ్లగా వృద్ధుడైన నిర్వాహకుడు లైంగిక దాడికి యత్నించాడు. మరో బాలిక చూసి కుటుంబీకులకు చెప్పడంతో పోలీసులు ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు.
ఈనెల 17వ తేదీ: అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో యువకులు కొన్నాళ్ల నుంచి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో 10 మందిపై పోక్సో కేసు నమోదైంది.


