పెనుబల్లి: ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే వంగా సుబ్బారావు మృతి బాధాకరమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి అన్నారు. పెనుబల్లి మండలం ముత్యాలబంజరలోని స్వగ్రామంలో సుబ్బారావు శనివారం మృతి చెందగా, ఆయన మృతదేహం వద్ద ఆదివారం ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించాక ఆమె మాట్లాడుతూ సుబ్బారావు ఎమ్మెల్యేగా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆమె వెంట వీఎం బంజర సర్పంచ్ భూక్యా ప్రసాద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, నాయకులు మిట్టపల్లి కిరణ్‌కుమార్, మేకతోటి కాంతయ్య, వంగా నిరంజన్‌గౌడ్, గోగినేని రమేశ్ తదితరులు ఉన్నారు.
కొత్త బట్టలు కొనివ్వలేదని..
క్షణికావేశంలో పురుగుమందు తాగి.. చికిత్స పొందుతూ మృతి
కరకగూడెం: కొత్త బట్టలు కొనివ్వలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు పురుగుమందు తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్‌ఐ పీవీఎన్ రావు తెలిపిన వివరాలు.. వట్టంవారిగుంపు గ్రామానికి చెందిన చర్చ రఘునాథరావు, ఈశ్వరమ్మ దంపతుల చిన్న కుమారుడు చర్చ చరణ్‌తేజ (19) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సహాయపడుతున్నాడు. ఈ నెల 18న గ్రామంలో జరిగిన వనభోజనాలకు వెళ్లేందుకు కొత్త బట్టలు కొనివ్వాలని తల్లిదండ్రులను కోరగా, తర్వాత కొనిస్తామని వారు చెప్పడంతో మనస్తాపానికి గురై క్షణికావేశంలో పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి.. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గంజాయి స్వాధీనం
భద్రాచలంటౌన్: ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు తరలిస్తున్న ఎండుగంజాయిని ఎకై ్సజ్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ సీహెచ్ శ్రీహరిరావు ఆధ్వర్యంలో కూనవరం – భద్రాచలంరోడ్డులోని ఇసుక రీచ్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా యమహా ఆర్15 బైక్‌పై వస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన బలరామ్ లామా, సుదీప్ కేసీని ఆపి తనిఖీ చేయగా 1.300 కిలోల గంజాయి దొరికింది. వారిని అదుపులోకి తీసుకుని, ద్విచక్రవాహనం, రెండు సెల్‌ఫోన్లు, రూ.4,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. సొత్తు విలువ సుమారు రూ.1.70 లక్షలు ఉంటుందని, కేసు నమోదు చేసి నిందితులను ఎకై ్సజ్ స్టేషన్‌లో అప్పగించామని అధికారులు తెలిపారు.


