చెట్లను చంపేస్తున్నాయి! | - | Sakshi
Sakshi News home page

చెట్లను చంపేస్తున్నాయి!

Jun 28 2026 12:10 AM | Updated on Jun 28 2026 12:10 AM

చెట్టుకు ఆపద రాకుండా చూసేదెవరు?

తీరు మారని విత్తన, క్రిమి సంహారక మందుల కంపెనీలు

రోడ్ల వెంబడి వృక్షాలకు మేకులతో

సైన్‌ బోర్డుల ఏర్పాటు

గతేడాది తొలగించినా మళ్లీ ఏర్పాటు చేస్తున్న కంపెనీలు

ఫలితంగా బలహీనమై చిన్నపాటి

గాలిదుమారాలకే పడిపోతున్న చెట్లు

గతేడాది ఆగస్టులో తొలగించినా..

ఫారెస్ట్‌శాఖలో సుదీర్ఘ కాలం పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన ఓ ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ గతేడాది జిల్లా పర్యటనకు వచ్చారు. జిల్లాలో ప్రవేశించింది మొదలు తిరిగి వెళ్లే వరకు ప్రతీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లకు మేకులతో కొట్టిన విత్తన, పురుగు మందుల కంపెనీల బోర్డులు కనిపించాయి. ఇలా చెట్లకు మేకులు కొట్టడం, వైర్లు గట్టిగా బిగించడం వల్ల ఐదు నుంచి పదిహనేళ్ల వయస్సు ఉండే చెట్లు బలహీనంగా మారిపోతాయని, చిన్న పాటి గాలిదుమారాలకే కూలిపోతాయంటూ అప్పటి కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి చెట్లకు మేకులతో కొట్టిన అమర్చిన బోర్డులను తొలగించే పనిని మండల పరిషత్‌ సిబ్బందికి అప్పగించారు. గతేడాది ఆగస్టులో రెండు వారాల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా చెట్లకు ఉన్న బోర్డులను తొలగించారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి.

మళ్లీ అదే తీరు

ఖరీఫ్‌ సీజన్‌ మొదలవడంతో విత్తన, పురుగు మందుల కంపెనీలు తిరిగి గ్రామీణ ప్రాంతాలపై కన్నేశాయి. తమ బ్రాండ్లను ప్రమోట్‌ చేసుకునేందుకు మళ్లీ పాత దారి పట్టాయి. అన్ని ప్రధాన రహదారుల వెంబడి ఉన్న చెట్లకు మేకులను కొడుతూ తమ బ్రాండ్లను ప్రమోట్‌ చేసుకుంటున్నాయి. గత ఏడాది సామాజిక బాధ్యతగా స్పందించిన ప్రభుత్వ యంత్రాంగాలు మరోసారి చెట్లపై జరుగుతున్న దాడిని మౌనంగా చూస్తూ ఉండిపోతున్నాయి.

బెరడు దెబ్బతిని..

వృక్ష శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేర్ల నుంచి చెట్టు పైభాగాలకు వెళ్లే పోషకాల సరఫరాలో బెరడు భాగం ఎంతో కీలకం. చెట్టు ప్రధాన కాండానికి పదుల సంఖ్యలో మేకులు దించడం వల్ల చెట్టు చుట్టూ ఉండే బెర డు భాగంలో దారు భాగం దెబ్బ తింటుంది. దీని వల్ల భూమి నుంచి చెట్టుకు కావాల్సిన నీరు అందదు. దీనికి తోడు పొలాల్లో రైతులు జల్లే పురుగుల మందులు, గడ్డి మందులు గాలి ద్వారా ప్రవహించి మేకుల ద్వారా అయిన గాయాల ద్వారా చెట్టులోకి ప్రవేశిస్తాయి. దీని తాలు కూ దుష్పరిణామాలు చెట్లపై పడుతున్నాయి. ఐదు నుంచి పది హేనేళ్ల వయసులో ఉండే చెట్లపై మేకు ల వల్ల ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఇటీవల చిన్నపాటి వానాలు, గాలులకే రోడ్ల పక్కన చెట్లు కూలిపోవడం వెనుక ప్రధాన కారణాల్లో మేకుల ఎఫెక్ట్‌ కూడా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

పూర్వ కాలంలో అశోకుడి నుంచి నేటి వరకు రోడ్ల పక్కన చెట్లను నాటడం, పెంచడమనేది ఓ సామాజిక బాధ్యతగా ఉంది. ఇప్పుడు సైతం వానాకాలం వచ్చిందంటే వన మహోత్స వం పేరుతో ఊరు వాడా, చేను చెలక, రోడ్ల వెంబడి లక్షలాది మొక్కలను వివిధ ప్రభుత్వ విభాగాల వారీగా నాటుతున్నారు. నాటిన మొక్కలు చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యతను పంచాయతీ సిబ్బందికి అప్పగించారు. బతికిన మొక్కకు మళ్లీ ఆపద రాకుండా చూసుకునే పనిని ఏ ఒక్క ప్రభుత్వ విభాగ మూ పట్టించుకోవడం లేదు. వాల్టా చట్టం వంటివి చెట్లను కొట్టివేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెబుతున్నాయి. కానీ, చెట్లకు సైలెంట్‌ కిల్లర్స్‌గా మారిన మినీ సైన్‌ బోర్డుల విషయంలో ఏమీ చెప్పలేదు. దీంతో ఫ్రీ పబ్లిసిటీ కోసం ప్రైవేటు పెస్టిసైడ్స్‌, సీడ్స్‌ కంపెనీలు చెట్ల ఉసురు తీసేస్తున్నాయి

అడిగే వారు లేకపోతే లాభాపేక్షకు ఏమైనా చేస్తామన్నట్టుగా విత్తన, క్రిమి సంహారక మందుల కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. రోడ్ల వెంబడి నాటిన చెట్లకు మేకులతో సైన్‌ బోర్డులు ఏర్పాటు చేస్తూ, చెట్ల ఉసురు తీసే పనిని మళ్లీ మొదలు పెట్టాయి.

– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement