ముందస్తు చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ముందస్తు చర్యలు చేపట్టాలి

Jun 28 2026 12:10 AM | Updated on Jun 28 2026 12:10 AM

● గోదావరి వరదలను సమర్థంగా ఎదుర్కోవాలి ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

● గోదావరి వరదలను సమర్థంగా ఎదుర్కోవాలి ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): గోదావరి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నా, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. భద్రాచలం పట్టణంలో గోదావరి నీరు చేరకుండా, వర్షపు నీరు వేగంగా నదిలోకి వెళ్లేలా పంపింగ్‌ మోటార్లను సిద్ధంగా ఉంచాలన్నారు. తాగునీరు, వైద్యం, పారి శుద్ధ్యం వంటి అత్యవసర సేవలపై దృష్టి సారించాలని చెప్పారు. భద్రాచలం–కూనవరం రహదారిపై చేపడుతున్న కరకట్ట నిర్మాణ పనులు మూడేళ్లుగా పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై సారపాక ఐటీసీ ఈస్ట్‌ గేట్‌ సమీపంలో గోదావరి వరదల సమయంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో జాతీయ రహదారి ఎత్తు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ జిల్లా, మండలస్థాయిలో ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను గుర్తించి, వైద్యం, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌, ఇరిగేషన్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ తదితర శాఖల ద్వారా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని, క్విక్‌ రెస్పాన్స్‌ బృందాలను కూడా ఏర్పాటు చేశామని వివరించారు. ఎస్పీ రోహిత్‌ రాజు మాట్లాడుతూ గోదావరి వరదల సమయంలో రెవెన్యూ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. భద్రాచలం, పినపాక, వైరా ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, రాందాస్‌ నాయక్‌, ఐటీడీఏ పీఓ రాహుల్‌, భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్‌, విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీఓ మధు, కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ మూడ్‌ గణేష్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పసుపులేటి వీరబాబు, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, కొత్తగూడెం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భానోత్‌ లాల్‌సింగ్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement