వచ్చిన ఒకే బిడ్ ఖరారు, పాత నిర్మాణాల తొలగింపుతో ప్రారంభం
మొదటి విడతలో రూ.200 కోట్లతో పనులు చేపట్టనున్న అధికారులు
ఇప్పటికే ఆళ్వార్ల తరలింపు
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అభివృద్ధి పనులకు నేడు తొలి అడుగు పడనుంది. శనివారం ఉదయం 7.30 నిమిషాలకు పూజా కార్యక్రమాలను నిర్వహించి పాత నిర్మాణాల తొలగింపు చేపట్టనున్నారు. రెండు నెలల క్రితం తొలిసారి టెండర్‌లను ఆహ్వానించినా బిడ్ కాలేదు. రెండోసారి టెండర్ పిలవగా ఒకే బిడ్ దాఖలు కాగా, ఆర్‌అండ్‌బీ శాఖ ఉన్నతాధికారులు పరిశీలించి ఆ బిడ్‌నే ఖరారు చేశారు. వేగవంతంగా పనులు పూర్తి చేయాలని హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మంత్రులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో టెండర్ దక్కించుకున్న వైఆర్‌కే నిర్మాణ సంస్థ ప్రతినిధులు, హైదరాబాద్‌కు చెందిన కన్సల్టెంట్ బాధ్యులు శుక్రవారం భద్రాచలం చేరుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయంలో చేపట్టాల్సిన పనులను ఈఓ దామోదర్‌రావుతో కలిసి పరిశీలించారు. తొలుత దక్షిణ భాగం వైపు ఉన్న నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించగా, వంటశాల, చిత్రకూట మండపం ఇతర నిర్మాణాలు తొలగించే అవకాశం ఉంది. అంతకుముందు కుసుమ హరనాథ బాబా ఆలయం దిగువ భాగాన భూమికి శనివారం పూజలు నిర్వహించనున్నారు.
30 నెలల గడువుతో..
దేవస్థానం అభివృద్ధిలో భాగంగా గోదావరి ఒడ్డున సుదర్శన చక్రం ప్లాన్‌కు రూ.75 కోట్లు, ఆలయ కాంప్లెక్స్ విస్తరణకు రూ. 180 కోట్లు, పరిసర ప్రాంతాల అభివృద్ధి, ఇతర కార్యాలయాల నిర్మాణానికి రూ.96 కోట్లతో మొత్తంగా రూ.351 కోట్లతో ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే ఆలయ కాంప్లెక్స్‌లో తొలి విడతగా చేపట్టిన పనులను రూ. 200 కోట్లకు పెంచి గోదావరి ఒడ్డున పనుల నిధులను కుదించారు. రూ.200 కోట్ల పనులకు టెండర్లు ఆహ్వానించి ఖరారు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న భవనాలను కూల్చి, శిథిలాలను తొలగించేందుకు రూ.4.97 కోట్లను టెండర్‌లో ప్రతిపాదించారు. ఇతర నిర్మాణాల్లో మొత్తం 1058 పనులకు రూ.200 కోట్ల 89 వేలుగా ప్రతిపాదన చేశారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం పేర్కొంటున్నా నిబంధనల్లో మాత్రం 30 నెలల లోపు గడువు విధించింది.
నేడు భద్రాచల రామాలయ అభివృద్ధి పనులకు ముహూర్తం
అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముందస్తుగా ఆలయంలోని ఆళ్వార్లను, ఉపాలయాల్లోని మూలమూర్తులను తరలించారు. ఇందుకోసం ఏప్రిల్ 26న కళావాహన పూజలను జరిపారు. అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారి మూలమూర్తులను, పంచలోహ విగ్రహాలను అంతరాలయంలో ఉంచారు. ఇతర ఆళ్వార్లు, మూలమూర్తులను , చిత్రకూట మండపంలో ఉన్న స్వర్ణపూత స్వామివారి వాహనాలను రంగనాయకుల గుట్టపైన ఉన్న ధ్యానమందిరానికి తరలించారు. పాత నిర్మాణాల తొలగింపుతోనే ఆలయ అభివృద్ధిలో తొలి అడుగు పడనుంది. కాగా, శనివారం ఉదయం పూజాదికార్యక్రమాలను నిర్వహించాక నిర్మాణాల తొలగింపు చేపడతామని, భక్తుల దర్శనానికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని ఈఓ కొల్లు దామోదర్‌రావు తెలిపారు.


