స్వర్ణకవచాలతో రామయ్య దర్శనం | - | Sakshi
Sakshi News home page

స్వర్ణకవచాలతో రామయ్య దర్శనం

Jun 27 2026 12:07 AM | Updated on Jun 27 2026 12:07 AM

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచాలతో దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.

పెద్దమ్మతల్లికి

పంచామృతాభిషేకం

పాల్వంచరూరల్‌: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో అమ్మవారికి శుక్రవారం పంచామృతాభిషేకం నిర్వహించారు. అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

రామయ్య సేవలో ఎమ్మెల్సీ

భద్రాచలంటౌన్‌: శ్రీ సీతారామచంద్రస్వామివారిని పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్‌ అంజిరెడ్డి శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి మూలవిరాట్‌ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించి, స్వామివారి జ్ఞాపిక, తీర్థప్రసాదాలను అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పార్టీ నాయకులు కుంజా ధర్మా, కుంజా సంతోష్‌, నిడదవోలు నాగబాబు, సత్యనారాయణ, చక్రవర్తి, రంగాచారి తదితరులు పాల్గొన్నారు.

గోదావరి వరదలపై నేడు ముందస్తు సమీక్ష

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కలెక్టరేట్‌లో శనివారం ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోదావరి వరదల సన్నద్ధతపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ అంకిత్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు సమావేశానికి నివేదికలతో సకాలంలో హాజరు కావాలని సూచించారు.

సీఎం సభకు భద్రతా ఏర్పాట్లు పరిశీలన

చింతకాని: చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్‌ వద్ద ఈనెల 30న జరిగే రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈమేరకు భద్రతా ఏర్పాట్లను శుక్రవారం అడిషనల్‌ డీసీపీ రామానుజం పరిశీలించారు. సీఎం పర్యటించే మార్గాలు, సభా ప్రాంగణం, హెలిప్యాడ్‌, పార్కింగ్‌ ప్రాంతాలే కాక ఇతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో చర్చించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పాటు వీఐపీలు, ఇతర వ్యక్తుల వాహనాల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటుచేయాలని సూచించారు. అలాగే, ఈనెల 28, 29వ తేదీల్లో జరిగే రైతుమేళాకు వచ్చే రైతులకు ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement