సీడబ్ల్యూసీ నిపుణుల సలహా..
● 2024 సెప్టెంబర్‌లో తెగిపోయిన ప్రాజెక్ట్ కట్ట ● రెండేళ్లవుతున్నా నిధులు విదల్చని ప్రభుత్వం ● ముగ్గురు కీలక మంత్రులున్నా ఫలితం శూన్యం
అశ్వారావుపేట: ఏపీ, తెలంగాణ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో 2024 సెప్టెంబర్ 18న జరిగిన క్లౌడ్ బరస్ట్ కారణంగా ఒక్కసారిగా గుబ్బలమంగమ్మ వాగు పొంగి ప్రవహించడంతో అశ్వారావుపేట మండలంలోని పెదవాగుపై గుమ్మడవల్లి వద్ద నిర్మించిన ప్రాజెక్ట్ కట్ట కొట్టుకుపోయింది. కుడి కాలువ, లాకులు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనతో రూ.3.5కోట్లతో తాత్కాలికంగా రింగ్ బండ్ నిర్మించారు. అది కూడా నిర్మించిన ఆర్నెళ్లకే గతేడాది సెప్టెంబర్‌లో కొట్టుకుపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. రెండేళ్లలో నాలుగు పంటలు కోల్పోయిన రైతులు దిక్కుతోచక చూస్తున్నారు.
మాజీ మంత్రి జలగం ప్రసాదరావు
ఫిర్యాదుతో..
పెదవాగు ప్రాజెక్ట్ పునర్నిర్మించకపోవడంతో తెలంగాణలోని అశ్వారావుపేట, ఏపీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 16వేల ఎకరాల ఆయకట్టులో గిరిజన రైతులు నష్టపోతున్నారని మాజీ మంత్రి జలగం ప్రసాదరావు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ తెగిన ప్రాజెక్టును సందర్శించారు. 15 రోజుల్లోగా పరిష్కారం చూపుతామని రైతులకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు సమావేశమయ్యారు. విషయాన్ని గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్‌ఎంబీ)కి అప్పగించారు. ఇరిగేషన్ అధికారుల అంచనా ప్రకారం తాత్కాలిక మరమ్మతులకు రూ.19 కోట్లు, జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు రూ.96 కోట్లతో మరమ్మతులు నిర్వహించాలని ప్రతిపాదించారు. ఏపీ ప్రభుత్వ 82 శాతం వాటా చెల్లించని కారణంగా ఈ రెండింటిలో ఏదీ మొదలు కాలేదు. కాగా ఆయకట్టు 16 వేల ఎకరాల్లో 13వేల ఎకరాలు ఏపీలో ఉండగా, మూడు వేల ఎకరాలు తెలంగాణలో ఉంది.
ప్రాజెక్ట్ సమస్యకు పరిష్కారం చూపాలని సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు కేంద్ర జలవనరుల శాఖ ప్యానల్ ఆఫ్ ఎక్సపర్ట్స్ నుంచి నిపుణుల బృందం గత మార్చిలో సందర్శించింది. రిజర్వాయర్ పరిధిని 40 వేల క్యూసెక్కుల నుంచి 1.2 లక్షల క్యూసెక్కులకు పెంచడంతోపాటు గేట్ల సంఖ్యను పెంచాలని నివేదించినట్లు సమాచారం. 5 గేట్లతో మాగ్జిమం ఫ్లడ్ డిశ్చార్జ్(ఎంఎఫ్‌డీ) 1.2లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రతిపాదనను ఇరిగేషన్ అధికారులు సీడబ్ల్యూసీకి సమర్పించారు. 10 రకాల పరీక్షలు నిర్వహిస్తూ సర్వే నిర్వహించిన అనంతరం డిజైన్ , ఎస్టిమేట్ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఫైనాన్స్ క్లియరెన్స్ వస్తేనే నూతన ప్రతిపాదనలు ముందుకు సాగుతాయి. కానీ అక్కడి ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ సమస్యపై ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వరరావును వివరణ కోరగా.. ప్రభుత్వం కోరిన ప్రతిపాదనలను పంపుతున్నామని, నిధులు మంజూరు చేస్తే మరమ్మతులు నిర్వహిస్తామని తెలిపారు.


