కనుల పండువగా రామయ్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కనుల పండువగా రామయ్య కల్యాణం

Jun 26 2026 4:17 AM | Updated on Jun 26 2026 4:17 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో గురువారం రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా సాగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

రామయ్య సేవలో..

శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ సర్వేశ్వర్‌ రెడ్డి గురువారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పర్యవేక్షకుడు లింగాల సాయిబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పెద్దమ్మతల్లికి

సువర్ణ పుష్పార్చన

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. అర్చకులు, పద్మనాభశర్మ, రవికుమార్‌ శర్మ పాల్గొన్నారు.

పల్స్‌పోలియోను

విజయవంతం చేయాలి

చుంచుపల్లి: ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ తుకారం రాథోడ్‌ సూచించారు. జిల్లా కార్యాలయంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో పనిచేస్తున్న వైద్యులు, ఫార్మసిస్టులు, ఏఎన్‌ఎంలతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని ఐదేళ్లలోపు చిన్నారులు అందరికీ పోలియో చుక్కలు వేయాలని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రభుత్వ ఆధీన పాఠశాలల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. పిల్లల్లో జన్యుపరమైన లోపాలు, వ్యాధులు, పోషకాహార లోపాలు, ఎదుగుదల అభివృద్ధి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. గుర్తించిన కేసులను జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్‌ సెంటర్‌కు రిఫర్‌ చేయాలన్నారు. సిబ్బంది ప్రతాప్‌, నాగభూషణం పాల్గొన్నారు.

నల్లబ్యాడ్జీలతో నిరసన

మణుగూరు టౌన్‌: వేతన పెంపుదల అమలును, పెర్ఫార్మెన్స్‌ రిలేటెడ్‌ పే చెల్లింపును డిమాండ్‌ చేస్తూ కోల్‌ మైన్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీఎంఓఏఐ) మణుగూరు విభాగం ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. రెండేళ్ల పీఆర్పీ బకాయిలు చెల్లించాలని, 2017 వేతన సవరణ నష్టాన్ని సవరించి కోల్‌ ఇండియాలో అమలు చేస్తున్న పే అప్‌గ్రేడ్‌ను సింగరేణిలో అమలు చేయాలని కోరారు. నాయకులు మదన్‌నాయక్‌, ఆర్‌.మధుబాబు, పి.రమేశ్‌, సురేష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement