కౌలు రైతులపై కనికరమేది? | - | Sakshi
Sakshi News home page

కౌలు రైతులపై కనికరమేది?

Jun 26 2026 4:17 AM | Updated on Jun 26 2026 4:17 AM

ఎరువులు కొనాలన్నా, పంటలు విక్రయించాలన్నా తప్పనిపాట్లు

అందని రైతు భరోసా, వ్యవసాయ రుణాలు ఇవ్వని బ్యాంకులు

పట్టాదారు దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తున్న వైనం

కౌలు రైతుల సమస్యలను పట్టించుకోని పాలకులు

బూర్గంపాడు: కౌలు రైతుల కష్టాలు ఏటికేడు పెరిగిపోతున్నాయి. ఎరువులు కొనుగోలు, పంట ఉత్పత్తులు అమ్మకాలకు పట్టాదారు పాస్‌ పుస్తకం, లింకై న్‌ ఫోన్‌ నంబర్‌, బ్యాంక్‌ అకౌంట్‌, ఓటీపీలు కీలకంగా మారడంతో ఇబ్బందులు తప్పడంలేదు. రైతు భరోసా కూడా దక్కటం లేదు. బ్యాంకుల నుంచీ పంట రుణాలు రావు. వెరసి కౌలు రైతు పరిస్థితి దయనీయంగా మారుతుంది.

2.5లక్షల ఎకరాల్లో కౌలు సాగు

జిల్లాలో సుమారు 2.5లక్షల ఎకరాల భూమిని 55 వేలమందికి పైగా కౌలు రైతులు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం ఎరువుల విక్రయాలకు ఫర్టిలైజర్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. యాప్‌లో పట్టాదారు పాస్‌ పుస్తకాల వివరాలను, పట్టాదారు పేరు, ఫోన్‌ నంబర్‌ను అప్‌లోడ్‌ చేస్తేనే యూరియా బుకింగ్‌కు అవకాశముంటుంది. యూరియా బుక్‌ చేయాలంటే పట్టాదారు ఫోన్‌నంబర్‌ ముందు ధ్రువీకరించి, ఆ తర్వాత ఓటీపీని అప్‌లోడ్‌ చేయాలి. యూరియా బుకింగ్‌ తర్వాత పట్టాదారుడు మళ్లీ ఓటీపీ చెబితేనే యూరియా కొనుగోలుకు వీలుంటుంది. కౌలు రైతు యూరియా బుక్‌ చేసుకోవాలంటే ముందు పట్టాదారును బతిమాలుకోవాలి. అతనిని అందుబాటులో ఉంచుకుని రెండుసార్లు ఓటీపీ చెప్పించుకోవాలి. ఒక ఎకరాకు తొలివిడతగా ఒక్క యూరియా బస్తాను అందుతుంది. ఈ ప్రక్రియ కోసం కౌలురైతు పొలం పనులు మానుకుని వేచిచూడాల్సివస్తోంది. యాప్‌ ఓపెన్‌ చేసిన తరువాత 30 నిమిషాల్లోనే యూరియా బస్తాలు బుక్‌ అవుతున్నాయి. భూములు కౌలుకు ఇచ్చిన కొందరు పట్టాదారులు యూరియాను తామే బుకింగ్‌ చేసుకుని ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

పంటలు అమ్మకాలకూ అవస్థే

పంటల అమ్మకాలకు కూడా అదేస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. సీసీఐలో పత్తి విక్రయించాలంటే ముందుగానే వ్యవసాయశాఖ వద్ద కౌలు రైతులుగా నమోదు చేయించుకోవాలి. ఈ ప్రక్రియకు కూడా పట్టాదారుడు ఓటీపీలు చెప్పాల్సి ఉంటుంది. లేకుంటే పట్టాదారుల పేరునే పత్తి అమ్ముకోవాలి. ధాన్యం అమ్మకాలకు కూడా కౌలు రైతులు పట్టాదారులనే ఆశ్రయించాలి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలంటే కౌలు రైతులు ముందుగా పట్టాదారు అనుమతితో వ్యవసాయశాఖ అధికారుల వద్ద ముందుగా నమోదు చేయించుకోవాలి. లేకుంటే పట్టాదారుడి పేరునే ధాన్యం విక్రయించుకోవాలి. ఆ ధాన్యం నగదు పట్టాదారుడి బ్యాంకు ఖాతాలోనే జమవుతుంది.

పెట్టుబడి సాయం అందదు

పంటల సాగుకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఇచ్చే రైతుభరోసా పట్టాదారులకే దక్కుతోంది. పంటలు సాగు చేసిన కౌలు రైతుకు రూపాయి సాయం కూడా అందటం లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో కౌలు రైతులకు కూడా రైతు భరోసా అందిస్తానని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. కౌలు రైతులకు బ్యాంకులు పంట రుణాలను ఇవ్వటం లేదు. దీంతో ప్రైవేటు అప్పులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్నా నష్టపరిహారం పట్టాదారులకే దక్కుతుంది. ప్రభుత్వం స్పందించి కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement