ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేయరూ.. | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేయరూ..

Jun 26 2026 4:17 AM | Updated on Jun 26 2026 4:17 AM

● భద్రాచలం ఏరియా హాస్పిటల్‌లో అందని సూపర్‌ స్పెషాలిటీ సేవలు ● అప్‌గ్రేడ్‌ చేయాలని ఎంపీ బలరాం నాయక్‌, సీపీఎం నేత జాన్‌వెస్లీ లేఖలు

● భద్రాచలం ఏరియా హాస్పిటల్‌లో అందని సూపర్‌ స్పెషాలిటీ సేవలు ● అప్‌గ్రేడ్‌ చేయాలని ఎంపీ బలరాం నాయక్‌, సీపీఎం నేత జాన్‌వెస్లీ లేఖలు

భద్రాచలంఅర్బన్‌: తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు కూడలిగా ఉన్న భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రి అప్‌గ్రేడేషన్‌కు నోచుకోవడం లేదు. ఏజెన్సీవాసులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందడంలేదు. ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌, 2డీ ఎకో వంటి సౌకర్యాలు లేవు. గుండె, న్యూరో, యూరాలజీ వైద్యులు కూడా లేరు. రోడ్డు ప్రమాదంలో గాయపడినా, తల, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చినా ఖమ్మం, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు వెళ్లలేక.. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో వైద్యం అందక ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రికి ఎక్కువమంది గిరిజనులే వస్తుంటారు. నిత్యం 200 పడకలు కిటకిటలాడుతుండగా వసతుల్లో లోపాలు, వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో అత్యాధునిక వైద్యం అందడంలేదు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిని అప్‌ గ్రేడ్‌ చేయాలని మహబూబాబాద్‌ ఎంపీ పోరిక బలరాం నాయక్‌ రెండేళ్ల క్రితం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తాజాగా భద్రాచలం ఏరియా ఆస్పత్రిని సందర్శించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ ఈ నెల 21న సీఎం రేవంత్‌ రెడ్డికి లేఖ రాయడంతో మరోసారి చర్చకు వచ్చింది. ఇక ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు కేబినెట్‌లో కీలక శాఖల చూస్తున్నారు. వీరు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పలుమార్లు భద్రాచలం వచ్చినా ఏరియా ఆస్పత్రిని సందర్శించిన దాఖలాలు లేవు. మంత్రులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని, ఆస్పత్రి అప్‌గ్రేడ్‌ చేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement