అస్తవ్యస్తంగా డ్రెయినేజీ వ్యవస్థ
ఏ చిన్న వర్షం పడినా రోడ్లపైకి వరద
అవస్థ పడుతున్న పట్టణ ప్రజలు
శాశ్వత పరిష్కారం కోసం ఎదురుచూపులు
వర్షాకాలం రానే వచ్చింది. మళ్లీ భద్రాచలం ప్రజల కష్టాలు ప్రారంభమయ్యాయి. ఏ చిన్న చినుకు పడినా రోడ్లపై వరద పారుతోంది. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు నేటికీ స్పందించడం లేదు. ఇలా చాలా ఏళ్లుగా అవస్థలు పడుతుండడంతో భద్రాచలానికి అత్యాధునిక డ్రెయినేజీ సిస్టాన్ని తీసుకొచ్చేలా సిటీ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని ప్రజలు వేడుకుంటున్నారు. శాశ్వత పరిష్కారం చూపి టెంపుల్ సిటీని అభివృద్ధి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. – భద్రాచలం
ఆక్రమణల చెరలో డ్రెయినేజీ..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు సుమారు భద్రాచలంలో 40 వేల జనాభా ఉండేది. విభజన అనంతరం భద్రాచలం తెలంగాణ పరిధిలోకి రాగా.. నివాసుల సంఖ్య ఎక్కువై ప్రస్తుతం అనధికార లెక్కల ప్రకారం లక్ష మంది వరకు జనాభా ఇక్కడ నివసిస్తున్నారు. దీంతో ఇబ్బడిముబ్బడిగా ఇళ్లు ఇష్టారీతిన వెలిసి కొన్ని చోట్ల డ్రెయినేజీ స్థలాలను సైతం కబ్జా చేశారు. సరైన డ్రెయినేజీ సిస్టం లేకుండానే రోడ్లపైకి వచ్చారు. కమర్షియల్ భవనాలకు అనుమతి పత్రాలు లేకుండానే నిర్మాణాలను చేపట్టారు. వెరసి ప్రధాన రోడ్లపైన ఉన్న వ్యాపార సముదాయాల ఆక్రమణలకు అడ్డే లేకుండా పోయింది. దీంతో చిన్నపాటి చినుకు పడినా రోడ్లపైకి వరద నీరు చేరుతుంది.
ముందుచూపేది..?
నానాటికీ జనాభా పెరుగుతూ సమస్య పెరుగుతున్నా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు కనీసం ముందు చూపు లేకపోవడంపై విమర్శలు వెల్లువెతుత్తున్నాయి. వర్షాకాలం వస్తుందంటే వాహనదారులు, పాదచారులు భయాందోళనలకు గురవుతున్నారు. కొద్దిపాటి వర్షం కురిసినా చర్ల రోడ్డు, ఉదయ్‌భాస్కర్ రోడ్డు, మిథిలా స్టేడియం చుట్టుపక్కల నీరు వరదలా పారుతుంటుంది. మరో వైపు శివారు కాలనీల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై ఇళ్లల్లోకి వరద నీరు చేరి జాగారం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈనేపథ్యాన ఈ సమస్య పరిష్కారానికి ముందస్తు ప్రణాళికతో స్థానికులతో పాటు భక్తులు, పర్యాటకులు, భవిష్యత్ తరాల అవసరాలు తీర్చేలా అత్యాధునికమైన సిటీ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని ప్రజలు వేడుకుంటున్నారు.
మాస్టర్ ప్లాన్‌లో మూడో ఫేజ్..
భద్రాచలం ఆలయ అభివృద్ధితో పాటు భద్రాచలం పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం మూడో ఫేజ్ కింద రూ.127 కోట్లను ప్రతిపాదించింది. అయితే రెండు ఫేజ్‌లు పూర్తయిన పిదపనే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చనుండగా.. తొలిఫేజ్‌లో రూ.200 కోట్లతో చేసే రామాలయ అభివృద్ధి పనులే ఇప్పటికీ ప్రారంభం కాలేదు. దీనికి ఎన్నేళ్లు పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు పోలవరం ముంపుతో భద్రాచలం వద్ద 43 అడుగులు వద్ద గోదావరి నిరంతరం ప్రవహిస్తుందని ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యాన మూడో ఫేజ్‌తో సంబంధం లేకుండానే పోలవరం ముంపును దృష్టిలో ఉంచుకుని పట్టణంలో వరద నీరు ముంపును తప్పించేలా అత్యాధునిక డ్రెయినేజీ వ్యవస్థతో పాటు ఇతర మౌలిక వసతులను కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావులు దృష్టి సారించేలా స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, ఎంపీ పోరిక బలరాంనాయక్‌లు నివేదికలను సిద్ధం చేయించాలని ప్రజలు వేడుకుంటున్నారు.
అత్యాధునిక డ్రెయినేజీ వ్యవస్థతో పాటు పోలవరం ముంపు నీరు ముంచెత్తినా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నూతన సిటీ మాస్టర్ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేయాలి. వాటికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించి యుద్ధప్రాతిపదికన అమలయ్యేలా తక్షణ చర్యలు చేపట్టాలి.
– ప్రసాద్‌రెడ్డి, స్థానికుడు
భద్రాచలం మాస్టర్ ప్లాన్ ఏర్పాటుపై తీవ్ర జాప్యం


