● కోదాడలో పూసపల్లి వాసి..
ఇల్లెందురూరల్: సూర్యపేట జిల్లా కోదాడలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని కొత్తపూసపల్లి గ్రామానికి చెందిన రమేష్(52) మృతి చెందాడు. లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న రమేష్ కోదాడ సమీపంలో లారీ ఆపి కిందకు దిగిన సమయంలో వెనకగా వచ్చిన కారు ఢీకొనడంతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రమేష్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
● ట్రాక్టర్ ఢీకొని ముత్తాపురం వాసి..
ఇల్లెందురూరల్: మండలంలోని పోలారం గ్రామపంచాయతీ బొంబాయితండా గ్రామ సమీపాన బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుండాల మండలం ముత్తాపురం గ్రామానికి చెందిన మోకాళ్ల సురేందర్ (38) మృతి చెందాడు. బైక్‌పై ఇల్లెందు నుంచి స్వగ్రామానికి వెళ్తున్న సురేందర్‌ను ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో మృతిచెందాడు. పోలీసులు సురేందర్ భౌతికకాయానికి గురువారం ఇల్లెందు ఆస్పత్రిలో శవపరీక్ష చేయించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు కొమరారం ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు.
పెళ్లయిన నాలుగు నెలలకే..
● ట్రాక్టర్ బోల్తాపడి యువకుడు మృతి
దుమ్ముగూడెం: పెళ్లయిన నాలుగు నెలలకే ఓ యువకుడిని మృత్యువు కబళించింది. పొలం దున్నేందుకు వెళ్లి ఇంటికి వస్తున్న క్రమాన ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడడంతో మృత్యువాతపడ్డాడు. ఈ విచారక సంఘటన మండలంలోని బైరాగులపాడు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... బైరాగులపాడు గ్రామానికి చెందిన ట్రాక్టర్ ఓనర్ అంగిరేకుల రుషికేష్ (28) గ్రామంలోని పొలంలో దుక్కి దున్నడానికి ట్రాక్టర్ తీసుకెళ్లాడు. ఈనేపథ్యాన దుక్కి రాకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చే క్రమాన ట్రాక్టర్‌ను పొలం నుంచి రోడ్డు ఎక్కిస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో దుమ్ముగూడెం ప్రాథమిక వైద్యశాలకు, అక్కడి నుంచి భద్రాచలంలోని వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
నాలుగు నెలల క్రితమే వివాహం..
మృతుడు రుషికేష్‌కు గత నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. చేతికందిన కొడుకు అకస్మాత్తుగా మృతి చెందడంతో తల్లిదండ్రులు, అతడి భార్య కన్నీరుమున్నీరుగా విలపించగా.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ఘటన స్థలాన్ని ఎస్‌ఐ జగన్మోహణాచారి సందర్శించి వివరాలను సేకరించారు.
● కాలేజీకి వెళ్తున్నానని చెప్పి వచ్చి అనంతలోకాలకు..
భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరి నదిలో దూకి విజయవాడకు చెందిన ఓ దివ్యాంగుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన పొట్టా సాయి జ్ఞానేష్ (25) అక్కడి ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో బీఏ చదువుతున్నాడు. పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతున్న జ్ఞానేష్ ఈ నెల 22న ఇంటి నుంచి కళాశాలకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వచ్చాడు. అనంతరం భద్రాచలం చేరుకున్న అతడు గోదావరి నదిలోకి దూకినట్లు సమాచారం. కాగా, స్థానిక సోషల్ మీడియా గ్రూపుల్లో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైందనే సమాచారం, ఫొటోలు వైరల్ కావడంతో వాటిని చూసిన మృతుడి తండ్రి పొట్టా భాస్కర్ వెంటనే భద్రాచలం చేరుకుని పరిశీలించగా తన కుమారుడు మృతదేహమేనని గుర్తించి కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భద్రాచలం ఏఎస్‌ఐ నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతుడి అమ్మమ్మది పట్టణంలోని భగవాన్‌దాస్ కాలనీ కావడంతో పాటు ఆయన ఎస్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. చేతికందిన కొడుకు నదిలో దూకి శవమై తేలడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
బైక్ అదుపు తప్పి ఇద్దరికి గాయాలు
ఇల్లెందురూరల్: మండలంలోని మాణిక్యారం గ్రామానికి చెందిన పొనక బాబూరావు, యదళ్లపల్లి నరేష్ గురువారం బైక్‌పై ఇల్లెందుకు బయలుదేరారు. ఈక్రమాన మస్సివాగు గ్రామం వద్ద మూలమలుపులో బైక్ అదుపు తప్పి కింద పడడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


