● మొక్కలు నాటే పనులను అడ్డుకున్న గిరిజనులు ● అనుమతి ఎవరిచ్చారని నిలదీత, వాగ్వాదం
ఇల్లెందురూరల్: మండలంలోని మామిడిగుండాల సీలింగ్ భూముల్లో గురువారం మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓవైపు భూపరిరక్షణ కమిటీ పేరుతో ఉద్యమం కొనసాగుతుండగా.. స్వేచ్ఛగా ట్రెంచ్ పనులు పూర్తి చేసుకున్న వ్యక్తి గురువారం జామాయిల్ మొక్కలు నాటేందుకు ప్రయత్నించడం స్థానిక గిరిజనులకు ఆగ్రహం తెప్పించింది. సీలింగ్ భూములపై భూస్వాములకు, సీలింగ్ పట్టాలు పొందిన గిరిజనులకు మాత్రమే హక్కు ఉంటుందని, మూడో వ్యక్తి ప్రవేశించి ట్రెంచ్ పనులు చేపట్టడం, మొక్కలు నాటడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంత స్వేచ్ఛగా పనులు చేసుకునేందుకు ఎవరు అనమతి ఇచ్చారని పనులు చేయించేంరుకు వచ్చిన గుమస్తాలను నిలదీస్తూ వాగ్వాదానికి దిగారు. కూలీలు మొక్కలు నాటకుండా అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తతకు మారడంతో పనులు సాఫీగా సాగేలా రక్షణ కల్పించేందుకు వచ్చిన పోలీసులు స్థానిక గిరిజనులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కూలీలు, పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సరిహద్దులు తేల్చకపోవడంతో..
భూగరిష్ట పరిమితి చట్టానికి లోబడి సీలింగ్ కింద తీసిన భూములను స్థానిక గిరిజనులకు గత నాలుగు దశాబ్ధాల క్రితమే పట్టాలు పంపిణీ చేశారు. ఆ సమయాన అధికారులు సరిహద్దులను పట్టాలో పేర్కొనకపోవడంతో నేటికీ సమస్యగా కొనసాగుతోందని స్థానికులు వాపోయారు. సీలింగ్ భూములను రెవెన్యూ అధికారులు సమగ్రంగా సర్వే చేసి సాగులో ఉన్న రైతులకు లేదా సీలింగ్ పట్టాలు కలిగి ఉన్న రైతులకు రెవెన్యూ పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు భూముల వద్దకు ఎవరు వచ్చినా ఇలాగే అడ్డుకుంటామని స్పష్టం చేశారు.


