● రెండ్రోజుల క్రితం కరెంట్ షాక్‌తో మహిళ మృతి ● అందుకు కారణమనే ప్రచారంతో వ్యక్తి ఆత్మహత్య
టేకులపల్లి: టేకులపల్లి మండలం బోడులో ఓ మహిళ మృతి చెందగా, అందుకు కారణమనే ప్రచారం జరగడంతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒక రోజు వ్యవధిలో జరిగిన ఈ ఘటనలు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. బోడు గ్రామ సర్పంచ్ పోదెం స్వరూప అత్త పోదెం చుక్కమ్మ(55) బుధవారం మొక్కంపాడులోని ఓ రైతు చేనులో పత్తి విత్తనాలు నాటేందుకు వెళ్లింది. ఆ సమయాన మూత్ర విసర్జన కోసం మరో చేనులోకి వెళ్లేందుకు ఫెన్సింగ్ దాటుతుండగా దానికి విద్యుత్ సరఫరా కావడంతో ఆమె షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయింది.
మృతికి కారణమనే భయంతో..
అయితే, చుక్కమ్మ మృతి చెందిన ఫెన్సింగ్ సమీపంలోనే బోడు గ్రామానికి చెందిన మాడే పాపయ్య(53) చేపలకుంట ఉంది. అందులోని బోర్లకు విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన వైర్లు ఫెన్సింగ్ మీదుగా వెళ్తున్నాయి. వైరులో లీకేజీతో ఫెన్సింగ్‌కు సరఫరా కావడం వల్లే చుక్కమ్మ మృతి చెందిందని ప్రచారం జోరుగా సాగింది. అయితే, చుక్కమ్మ కుటుంబీకులెవరూ పాపయ్యకు వ్యతిరేకంగా మాట్లాడకపోగా, ఆయనపై ఫిర్యాదు కూడా చేయలేదు. కానీ చుక్కమ్మ మృతికి తానే కారణంగా అంటున్నారని భావించిన పాపయ్య గురువారం ఉదయం ఇంట్లో మిగిలిన అన్నం చేపలకు వేసి వస్తానని చెప్పి కుంట వద్దకు వెళ్లి మంచెకు ఉరి వేసుకున్నాడు. రెండు ఘటనలపై బోడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈమేరకు గురువారం ఉదయం చుక్కమ్మ, సాయంత్రం పాపయ్య అంత్యక్రియలు జరిగాయి.
సెల్ఫీ వీడియో?
ఇదిలా ఉండగా చేపలకుంట వద్దకు వెళ్లిన పాపయ్య ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో చిత్రీకరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఎవరి మాటలతో తాను మనస్తాపానికి గురయ్యానో అందులో రికార్డు చేసి వీడియో భార్యకు వీడియో తెలియగా, ఆ వీడియోను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా, పాపయ్య నేత్రాలను దానం చేయాలన్న కుటుంబీకుల నిర్ణయంతో అగర్వాల్ కంటి ఆస్పత్రి సిబ్బంది సేకరించారు.


