11 ఏళ్లయినా ప్రారంభానికి
నోచుకోని వారధి
రెండు నెలల క్రితం అప్రోచ్ రోడ్డు
కుంగడంతో ఏర్పడిన భారీ గొయ్యి
గోదావరికి వరదలు వస్తే సారపాక వైపు రోడ్డు పూర్తిగా తెగిపోయే అవకాశం
నిర్మాణ పనులు పూర్తి చేయకపోతే వాహనాల రాకపోలకు ఇబ్బందులే
భద్రాచలం వద్ద గోదావరిపై నిర్మించిన కొత్త బ్రిడ్జి ప్రమాదపుటంచున ఉంది. జాతీయ రహదారుల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో అప్రోచ్ రోడ్డు రెండు నెలల క్రితం కుంగింది. ప్రయాణికులు గమనించి హెచ్చరించటంతో రాకపోకలను నిలిపివేశారు. అప్పటి నుంచి అప్రోచ్‌రోడ్డు, బ్రిడ్జి నడుమ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు వర్షాకాలం వచ్చింది. గోదావరి వరదలు ముంచెత్తితే బ్రిడ్జి, పిల్లర్లు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. –భద్రాచలం
తప్పిన పెను ప్రమాదం
ఆగుతూ.. సాగిన రెండో బ్రిడ్జి పనులను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరంతరం పర్యవేక్షించారు. ఎట్టకేలకు 2024 శ్రీరామనవమి నాటికి పనులు పూర్తి చేసి, అనధికారికంగా రాకపోకలు సాగించారు. రెండు వైపులా అప్రోచ్ రోడ్డు నిర్మించినా లైటింగ్‌తోపాటు రెండు వైపులా అప్రోచ్ రోడ్డుకు రెయిలింగ్ ఏర్పాటు చేయలేదు. దీంతో రోడ్డు ప్రమాదాలతో పలువురు మృత్యువాత పడిన సంఘటనలు జరిగాయి. దీంతో పత్రికల్లో కథనాలు రాగా ఒక వైపు మాత్రం లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇక సారపాక గ్రామం వైపు నూతన బ్రిడ్జికి, అప్రోచ్ రోడ్డుకు మధ్య కోతకు గురై పెద్ద అగాథం ఏర్పడింది. గమనించిన ప్రయాణికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.
వరదల కాలం వస్తున్నా..
పనులు హడావుడిగా చేసిన ఫలితమే ఈ అగాథం అనే అభిప్రాయం వక్తమవుతోంది. వేసవి కాలంలో భారీ గొయ్యి ఏర్పడగా, ప్రత్యామ్నాయ పనులు చేపట్టినా ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రస్తుతం రెండో బ్రిడ్జి పిల్లరుకు, అప్రోచ్‌రోడ్డుకు నిలువుగా గోడ కడుతున్నారు. రెండు నెలలు నుంచి పనులు చేస్తున్నా సగం కూడా పూర్తికాలేదు. వర్షాకాలం రావడంతో గోదావరి వరదలు వచ్చే అవకాశం ఉంది. వరదలు సంభవిస్తే మట్టి కోతకు గురై బ్రిడ్జికి, సారపాక వైపు రహదారికి మధ్య అప్రోచ్ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయే అవకాశం ఉంది. బ్రిడ్జి కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇక సారపాక వైపు రెండో బ్రిడ్జికి వచ్చే దారిని పూర్తిగా మూసివేయకపోవడంతో తెలియక ప్రయాణం చేసే వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం కూడా లేకపోలేదు. జాతీయ రహదారుల శాఖ అధికారులు సత్వరమే పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
రెండో బ్రిడ్జిపై అనధికారికంగా రాకపోకలు సాగుతున్నా అధికారికంగా ప్రారంభించలేదు. 11 ఏళ్లు గడిచినా నిర్మాణం పూర్తికాలేదు. కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ నాటి తెలంగాణ రోడ్లు, భవనాల, సీ్త్ర శిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి 2015, ఏప్రిల్ 1న శంకుస్థాపన చేశారు. 36 పిల్లర్లతో, సారపాక వైపు 600 మీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మాణం, 12 మీటర్ల వెడల్పుతోపాటు ఇరువైపులా 4 అడుగుల ఫుట్‌పాత్‌లతో బ్రిడ్జి రూపకల్పన చేశారు. రూ.65 కోట్లతో పనులను ప్రారంభించిన రాజ్‌దీప్ కంపెనీ సకాలంలో పూర్తి చేయలేకపోయింది. తొలుత 2016, అనంతరం 2019, 2021 వరకు గడువు పొడిగించారు. అప్పటికీ పూర్తి చేయలేకపోవడంతో నేరుగా జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలోనే పనులు చేపట్టారు. రెండు వైపులా అప్రోచ్ రోడ్డుకు రెయిలింగ్, బ్రిడ్జిపై లైటింగ్ పనులు పూర్తిచేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అధికారికంగా ప్రారంభానికి నోచుకోలేదు.
భద్రాచలం వద్ద గోదావరిపై నూతన బ్రిడ్జి


