ప్రతీ ఓటరుకూ రెండేసి పత్రాలు
ఓటర్ల ఇంటింటికీ వెళ్లనున్న బీఎల్‌ఓలు
ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ,
ఆ తర్వాత సేకరణ
ఎస్‌ఐఆర్‌పై పార్టీల అలర్ట్..
బీఎల్‌ఏలకు సూచనలు
పాల్వంచరూరల్: ఓటర్ల జాబితా ప్రక్షాళనలో కీలకమైన ఇంటింట ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ గురువారం మొదలుకానుంది. బుధవారం మండల కేంద్రాల్లో సిబ్బందికు ఎన్యుమరేషన్ ఫారాలు అప్పగించారు. ఎస్‌ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)లో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ప్రతీ ఇంటికి వెళ్లి ఓటర్ల గణన చేపడుతారు. ఇప్పటికే 2002 ఓటర్ల జాబితాతో 2025 ఓటర్ల జాబితాను సరిపోల్చి మ్యాపింగ్ చేశారు. అధికభాగం ఓటర్ల మ్యాపింగ్ పూర్తికాగా, వీరు తమ ఇంటికి వచ్చే బీఎల్‌ఓలకు ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి అందించాల్సి ఉంటుంది. మ్యాప్ కాని వారు ఎన్యుమరేషన్ ఫామ్‌తోపాటు 11 ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలి. గురువారం నుంచి వచ్చేనెల 24 వరకు జరిగే ఈ కార్యక్రమ నిర్వహణకు యంత్రాంగం సిద్ధమైంది.
బీఎల్‌ఓల నియామకం
జిల్లావ్యాప్తంగా ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేలా అధికారులు సిద్ధమయ్యారు. ఏఈఆర్‌ఓలు, జిల్లా /అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్లు, సూపర్ వైజర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారు. వీరి సమన్వయంతో బూత్ స్థాయి అధికారులు సర్వే చేపడుతారు. అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఇంటింటి సర్వే సాగనుంది.
పార్టీలకూ భాగస్వామ్యం
ఓటర్ల నమోదు, సవరణలో తప్పులు జరగకుండా, పారదర్శకత పెంచేందుకు రాజకీయ పార్టీలకు కూడా ఎన్నికల సంఘం భాగస్వామ్యం కల్పించింది. ‘సర్’ పర్యవేక్షణకు రాజకీయ పార్టీలు బీఎల్‌ఏ(బూత్ లెవెల్ ఏజెంట్లు)లను నియమించే వెసులుబాటు కల్పించారు. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో వివిధ పార్టీల తరఫున బీఎల్‌ఏలను నియమించారు. ఈ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలు చేపట్టే ఓటర్ల గుర్తింపు ప్రక్రియను పరిశీలిస్తూ, ఓటర్లకు కావాల్సిన సలహాలు ఇస్తారు.
జూలై 31న ముసాయిదా జాబితా
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు. అందులో పేరు లేకున్నా, ఇతర అభ్యంతరాలపై ఆగస్టు 30వరకు దరఖాస్తులు స్వీకరించి, వీటిని సెప్టెంబర్ 28 నాటికి పరిష్కరిస్తారు. ఆపై అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు. అయితే, ఎన్యుమరేషన్ ఫారం సమర్పించని వారి పేర్లు ముసాయిదా ఓటరు జాబితాలో ఉండవని అధికారులు వెల్లడించారు.
ఓటర్లకు ఇచ్చేందుకు గాను బీఎల్‌ఓలకు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యకు రెట్టింపు స్థాయిలో ఈ ఫారాలు పంపిణీ చేస్తా రు. బీఎల్‌ఓలు ప్రతీ ఇంటికి వెళ్లి తాళం వేసి ఉంటే కనీసం మూడు సార్లు సందర్శించాల్సి ఉంటుంది. ఓటరుకు ఎన్యుమరేషన్ పత్రాలు రెండు ప్రతులు అందజేస్తారు. ఓట రు అందులో వివరాలను నింపాక సంతకం చేస్తే, బీఎల్‌ఓ ఒకటి తీసుకుని, రెండో ప్రతిని రశీదు సహా ఓటరుకు అందజేస్తారు. ఇక ఆన్‌లైన్ ద్వారా voters. eci. gov. in పోర్టల్‌లో ఓటీపీ ధ్రువీకరణ పక్రియ కూడా పూర్తి చేసే వెసులుబాటు ఉంది.


