ఆశలు మొలకెత్తగా.. | - | Sakshi
Sakshi News home page

ఆశలు మొలకెత్తగా..

Jun 25 2026 12:06 AM | Updated on Jun 25 2026 12:06 AM

మొన్న కురిసిన వర్షంతో

మొలకెత్తిన పత్తి గింజలు

వరినార్లు పోసేందుకు

సిద్ధమవుతున్న రైతులు

ఈసారి వానాకాలం

సాగు పక్షం రోజులు ఆలస్యం

బూర్గంపాడు: ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. జిల్లావ్యాప్తంగా గత మంగళవారం తెల్లవారుజాము నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో ఇన్నాళ్లు అటూ ఇటు కాని వర్షాలతో పత్తి గింజలు మొలకెత్తక ఆందోళనకు గురైన రైతులు ఊపిరిపీల్చుకున్నారు. పత్తి గింజలు మొలకలు వస్తుండడంతో రైతుల మోములో ఆనందం వ్యక్తమవుతోంది. వరి నార్లు ఆలస్యమయ్యాయని భావిస్తున్న రైతులు తాజా వర్షంతో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

పొడి దుక్కుల్లోనే విత్తనాలు

ఈ ఏడాది జిల్లాలో రైతులు పొడిదుక్కులలో పత్తి గింజలు నాటారు. ఈ నెల మొదటివారంలో వేసిన గింజలు మొలక వచ్చినా వర్షాలు లేక ఎండిపోయాయి. ఇంకొన్ని గింజలు భూమిలోనే మురిగిపోయాయి. దీంతో పలువురు రైతులు రెండో విడత గింజలు వేసుకున్నారు. జూన్‌ రెండో వారం నుంచి వర్షాల కోసం ఎదురుచూస్తున్నా తేలికపాటి జల్లులే తప్ప పదునుకు సరిపడా వాన కురవలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం కురిసిన వర్షానికి పత్తి గింజలు మొలకలు రావడంతో ఇన్నాళ్లు వేచిచూసే ధోరణి అవలంబించిన రైతులు కూడా గింజలు నాటడంలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది జిల్లాలో 2.15 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తారని అధికారులు అంచనా రూపొందించారు. ఈ మేరకు పత్తితో పాటు ఇతర పంటల సాగుకు అవసరమైన యూరియా, కాంప్లెక్స్‌ ఎరువుల కొనుగోళ్లలో రైతులు నిమగ్నమయ్యారు. యూరియా ఫర్టిలైజర్‌ యాప్‌లో బుక్‌ చేసుకోవాల్సి ఉండడం, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరుగుతుండటంతో ముందస్తుగా కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు.

ఏడు రకాలకే..

ఈ వానాకాలం ఏడు రకాల సన్న వరి విత్తనాలను ప్రకటించిన ప్రభుత్వం, అవి సాగు చేసిన వారికే బోనస్‌ ఇస్తామని వెల్లడించింది. అందులో ఈ ఏడాది ఎక్కువగా బీపీటీ–5204 (సాంబ మసూరి), ఆర్‌ఎన్‌ఆర్‌–15048 (తెలంగాణ సోనా), హెచ్‌ఎంటీ రకాల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. అధిక దిగుబడి ఇచ్చే ఇతర సన్నరకాలు ఉన్నా క్వింటాకు రూ.500 బోనస్‌ కోసం రైతులు ప్రభుత్వం సూచించిన రకాలనే ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశముంది. అయితే ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయన్న అధికారుల సూచనలు పాటిస్తే మాత్రం సాగు విస్తీర్ణం తగ్గుతుందని భావిస్తున్నారు. అయినప్పటికీ సాగు విస్తీర్ణం లక్ష ఎకరాలకు తగ్గకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇక పత్తి, వరి తర్వాత రైతులు ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేసే అవకాశముంది. ఇంకొందరు ఆయిల్‌పామ్‌, జామాయిల్‌ సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఇవన్నీ కాక 5 వేల ఎకరాల్లోపే కంది, పెసర, మినుము సాగు చేస్తారని చెబుతుండగా, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగుకు సరైన వర్షాల కోసం రైతులు వేచిచూస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement