భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తది తర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడామండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపారు.
ముగ్గురు ఎఫ్‌డీఓల నియామకం
చుంచుపల్లి: ఇటీవల అటవీశాఖలో జరిగిన సాధారణ బదిలీల్లో ఖాళీ అయిన కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ అటవీ డివిజన్లకు బుధవారం ముగ్గురు ఎఫ్‌డీఓలను తాత్కాలికంగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాచలానికి యూ.కోటేశ్వరరావు, కొత్తగూడేనికి మంజుల, పాల్వంచకు కృష్ణ ప్రసాద్‌లను నియమించారు. జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణాగౌడ్ త్వరలోనే పదోన్నతిపై బదిలీకానున్నారు. ఆయన స్థానంలో ఐఎఫ్ ఎస్ అధికారి రానున్నట్లు తెలిసింది.
గుణాత్మక విద్యనందించాలి
డీఈఓ వాసంతి
పాల్వంచ: విద్యార్థులకు గుణాత్మక విద్యనందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి ఆదేశించారు. బుధవారం కేటీపీఎస్ ఎ కాలనీ లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమయపాలన పాటించాలన్నారు. డ్రాప్ అవుట్లు లేకుండా చూసుకోవాలన్నారు. అనంతరం తరగతి గదులు పరిశీలించారు. ఎంఈఓ ఎ.శ్రీరాంమూర్తి, హెచ్‌ఎం రమాదేవి పాల్గొన్నారు.
వైటీపీఎస్‌లో టెండర్లు రద్దు చేయాలి
పాల్వంచ: యాదాద్రి పవర్ స్టేషన్‌లో ఇటీవల ప్రభుత్వం పిలిచిన ప్రైవేట్ టెండర్లను రద్దు చేయాలని తెలంగాణ స్టేట్‌పవర్ ఎంప్లాయీస్ జేఎసీ, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఎసీ నాయకులు కోరారు. బుధవారం కేటీపీఎస్ 5,6,7 దశల కర్మాగారాల్లో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో వేర్వేరుగా ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన గేట్ల వద్ద ధర్నా చేశారు. జేఏసీ నాయకులు ఉమా మహేశ్వరరావు, యాస్మిన్, హారీష్, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏప్రిల్–మే నెలల్లో నిర్వహించిన డిగ్రీ ఐదు, ఆరో సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఐదో సెమిస్టర్ పరీక్షలకు 12,726 మంది హాజరుకాగా 5,260మంది(41.33శాతం), ఆరో సెమిస్టర్ పరీక్షలకు హాజరైన 33,205 మందిలో 16,119 మంది(48.54శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అధికారులు తెలిపారు. డిగ్రీ పరీక్ష ఫలితాలను కేయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని వివరించారు. కాగా, విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం 15రోజుల్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇక సుమారు 40 కళాశాలల యాజమాన్యాలు యూనివర్సిటీకి వివిధ రకాల ఫీజులు చెల్లించకపోవడం, ఆయా కళాశాలల్లోని విద్యార్థుల ఫలితాలను వెల్లడించలేదు. దీంతో వెబ్‌సైట్‌లో చూసుకున్న విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఈ అంశంపై యాజమాన్యాలు సంప్రదించగా, ఫీజు బకాయిల వివరాలు వెల్లడించడంతో సాయంత్రం వరకు 10 కళాశాలల బాధ్యులు చెల్లించారు. దీంతో ఆయా కళాశాలల విద్యార్థుల ఫలితాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు.


