సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికి వెళ్లినప్పుడు అనుసరించాల్సిన విధానాలు, ఫారాల సమర్పణ ప్రక్రియ, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాలు, ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ దశలు, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి అధికారులు క్షేత్రస్థాయి సన్నాహక శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసినట్లు తెలిపారు. వచ్చే నెల 24 నుంచి 30 వరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు ఉండేలా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపడతామని తెలిపారు.
నోటీసులు, విచారణ అనంతరం తొలగింపు
తప్పుడు సమాచారం సమర్పించిన సందర్భాల్లో వెంటనే తొలగింపు చేయకుండా, ముసాయిదా జాబితా అనంతరం నోటీసులు జారీ చేసి విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వలస వెళ్లినా, మరణించినా, డూప్లికేట్ ఓటర్లను జాబితా నుంచి తొలగించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత జాబితాలో పేరు లేని అర్హులైన కొత్త ఓటర్లు తప్పనిసరిగా ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారిన వారు ఫారం–8 ద్వారా వివరాల సవరణ చేసుకోవచ్చని అన్నారు. ప్రతిరోజు బీఎల్‌వోలు గరిష్ఠంగా 50 ఫారాల వరకు సమర్పించే అవకాశం ఉందని తెలిపారు. సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ నంబర్ 1950ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల శాఖ సూపరిండెంట్ రంగ ప్రసాద్, రాజకీయ పార్టీల ప్రతినిధులు వెంకటేశ్వర నాయక్, అన్వర్, లక్ష్మణ్ అగర్వాల్, అన్నవరపు సత్యనారాయణ, రవి నాయక్, ఎన్నికల శాఖ సిబ్బంది నవీన్ పాల్గొన్నారు.


