ప్రాణాలతో చెలగాటం.. | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలతో చెలగాటం..

Jun 25 2026 12:06 AM | Updated on Jun 25 2026 12:06 AM

కాలం చెల్లిన బస్సులను

వినియోగిస్తున్న ప్రైవేట్‌

పాఠశాలల యాజమాన్యాలు

బస్సుల్లో కనిపించని కనీస జాగ్రత్తలు..

నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్న రవాణాశాఖ అధికారులు

వారం దాటినా అంతే..

పాఠశాలలు పున:ప్రారంభం అయ్యే నెల ముందుగానే ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు వారి బస్సులను రవాణాశాఖ అధికారుల చేత తనిఖీలు చేయించి, ఫిట్‌నెస్‌ ధ్రువపత్రం పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే బస్సులను నడిపించాల్సి ఉంటుంది. కానీ, జిల్లాలో పాఠశాలలు ప్రారంభమై పది రోజులు కావొస్తున్నా జిల్లాలోని చాలా ప్రైవేట్‌ పాఠశాలల బస్సులు ఇంకా ఫిట్‌నెస్‌ ధ్రువపత్రం పొందకుండానే విద్యార్థులను చేరవేస్తున్నాయి. అలాగే, వారు కనీస నిబంధనలు పాటించడం లేదు. ఇక అధికారులు తనిఖీల మాటెత్తడం లేదు.

ఇంకా 31 బస్సులు..

జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో ఊర్ల నుంచి వచ్చి చదివే విద్యార్థులను చేరవేసేందుకు కాలంచెల్లిన బస్సులను వాడుతున్నట్లు తెలిసింది. అటువంటి వాటిని రవాణాశాఖ అధికారులు గుర్తించి చర్యలు తీసుకుంటే ప్రమాదాలు తప్పుతాయి. జిల్లాలో ప్రైవేట్‌ విద్యాసంస్థలకు సంబంధించిన మొత్తం 231 బస్సులు ఉండగా, వాటిల్లో ఇప్పటివరకు 200 బస్సులు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందాయని, మిగతా 31 బస్సులు ఇంకా సర్టిఫికెట్‌ పొందలేదని జిల్లా రవాణా శాఖాధికారులు చెబుతున్నారు. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తనిఖీలు చేయడం.. ఒక్క బస్సుకు జరిమానా విధించడం, సీజ్‌ చేసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.

ఇవీ నిబంధనలు..

● ఐదేళ్లకుపైగా అనుభవం ఉన్నవారినే డ్రైవర్లుగా నియమించుకోవాలి. 60 ఏళ్లు పైబడిన వారిని తీసుకోవద్దు.

● డ్రైవర్లకు ప్రతి మూడు నెలలకోమారు మధుమేహం, రక్త పరీక్షలు, కంటిచూపు పరీక్షలు చేయించాలి.

● కాలం చెల్లిన బస్సులను ఉపయోగించొద్దు.

● బస్సుల్లో అత్యవసర చికిత్స బాక్సు ఏర్పాటు చేయాలి.

● ప్రతి బస్సుకు కూడా డ్రైవర్‌తో పాటు అటెండర్‌ను నియమించాలి.

● బస్సు బయట ఎడమ వైపు పాఠశాల పేరు, డ్రైవర్‌ పేరు, సెల్‌ నెంబర్‌ వివరాలు రాయాలి.

● బస్సులో అగ్నిమాపక యంత్రం, సరైన అద్దం ఏర్పాటు చేయాలి.

● పుట్‌బోర్డు మొదటి మెట్టు భూమికి 325 ఎంఎం ఎత్తు మించకుండా ఏర్పాటు చేసుకోవాలి.

● అత్యవసర కిటికీని ఏర్పాటు చేసి, దాని వినియోగం ఎలానో రాసి పెట్టాలి.

పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ ఉండాలనే కోరికతో తల్లిదండ్రులు ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. వారి ఆశ ప్రైవేట్‌ పాఠశాలలకు క్యాష్‌గా మారుతోంది. అడ్మిషన్లు చేయించుకున్న తర్వాత వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక స్కూల్‌ బస్సుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది. కాలంచెల్లిన బస్సులకు అరకొరగా మరమ్మతులు చేయించి నడిపిస్తున్నట్లు సమాచారం. వాటిల్లో ఏదైనా సమస్య తలెత్తిందంటే

అంతే సంగతులు. – కొత్తగూడెంఅర్బన్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement