విజయ డెయిరీపై నీలినీడలు | - | Sakshi
Sakshi News home page

విజయ డెయిరీపై నీలినీడలు

Jun 25 2026 12:06 AM | Updated on Jun 25 2026 12:06 AM

● ప్యాకింగ్‌ సెక్షన్‌ నిలిపివేతకు అడుగులు ● ఇకపై వరంగల్‌ నుంచి పాలు, పెరుగు ప్యాకెట్ల సరఫరా ● ప్రశ్నార్థకంగా మిషనరీ, 27మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల భవితవ్యం

ప్రైవేట్‌ డెయిరీలకే మేలు

వరంగల్‌ నుంచి పాల ప్యాకెట్లు

● ప్యాకింగ్‌ సెక్షన్‌ నిలిపివేతకు అడుగులు ● ఇకపై వరంగల్‌ నుంచి పాలు, పెరుగు ప్యాకెట్ల సరఫరా ● ప్రశ్నార్థకంగా మిషనరీ, 27మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల భవితవ్యం

ఖమ్మం వ్యవసాయం: ఖమ్మంలోని తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య(విజయ డెయిరీ) మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. డెయిరీ ఆవరణలోని పాలు, పెరుగు ప్యాకెట్ల తయారీ విభాగాన్ని నిలిపివేసే దిశగా అడుగులు పడుతున్నాయి. వరంగల్‌ యూనిట్‌ నుంచి పాల ప్యాకెట్లను ఉమ్మడి జిల్లాకు సరఫరా చేయాలని ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఇక్కడ అన్ని వసతులు, మిషనరీ ఉన్నా ప్యాకింగ్‌ నిలిపివేసి, వరంగల్‌ నుంచి సరఫరాకు నిర్ణయించడంతో ఖమ్మం డెయిరీ నిర్వహణ ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

నిత్యం ప్యాకింగ్‌, విద్యాసంస్థలకు సరఫరా

ఖమ్మం విజయ డెయిరీలో నిత్యం 10 – 12 వేల పాలు, పెరుగు ప్యాకెట్లను తయారు చేసే మిషనరీ ఉంది. ఉమ్మడి జిల్లాలో సేకరించే పాలతో ప్యాకెట్లు చేసి ప్రభుత్వ హాస్టళ్లు, విద్యాసంస్థలకు సరఫరా చేస్తున్నారు. అయితే, ఉన్నతాధికారులు ఇటీవల నిర్వహించిన సమావేశంలో వరంగల్‌ యూనిట్‌ నుంచి పాల ప్యాకెట్లను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని హాస్టళ్లకు సరఫరా చేయాలని ఖమ్మం అధికారులను ఆదేశించారు. అంతేకాక ఇక్కడి కాంట్రాక్టర్‌కే ఆ బాధ్యతలు అప్పగించాలని సూచించగా, సదరు కాంట్రాక్టర్‌ సమ్మతించలేదు. దీంతో మరో కాంట్రాక్టర్‌ ఎంపికకు సైతం వెనకాడొద్దని చెప్పినట్లు తెలిసింది. ఇదే జరిగితే ఖమ్మం ప్యాకింగ్‌ సెక్షన్‌లో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల పరిస్థితి ఏమిటో తెలియరావడం లేదు.

అభివృద్ధి చేస్తామంటూనే...

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం పాడి పరిశ్రమ అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షలో పరిశ్రమ ఆధునీకరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాక పాల సేకరణ పెరిగేలా పాడి గేదెల కొనుగోలుకు రైతులకు రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లతో మాట్లాడాలని సూచించారు. దీంతో కలెక్టర్‌ పర్యవేక్షణలో రూ. 2.35 కోట్లతో అభివృద్ధికి నివేదిక సిద్ధం చేశారు. ఇంతలోనే ప్యాకింగ్‌ సెక్షన్‌ను నిలిపివేసేందుకు చర్యలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. యూనిట్‌ను మరో ప్రాంతానికి తరలించి అధునాతన సాంకేతికతతో నిర్మిస్తారా.. లేక సిక్‌ ఇండస్ట్రీగా పరిగణించి మూసేస్తారా అన్న చర్చ మొదలైంది.

50ఏళ్ల క్రితం పదెకరాల్లో ఏర్పాటు

ఉమ్మడి జిల్లాలో వనరులు ఉండటంతో 50 ఏళ్ల క్రితం ఇక్కడ పరిశ్రమ నెలకొల్పారు. పాల శీతలీకరణ, పాలు, పెరుగు ప్యాకెట్లను తయారీ, నిల్వ కోసం ఖమ్మం రోటరీనగర్‌లో ప్రధాన రహదారి వెంట పదెకరాల స్థలంలో ఈ పరిశ్రమ ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ స్థలం విలువే రూ. వందల కోట్లలో ఉంటుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు సూర్యాపేట జిల్లా నుంచి దాదాపు 12 వేల మంది రైతులు సీజన్‌లో 25వేల లీటర్ల పాలు సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని హాస్టళ్లు, ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేయడమే కాక విక్రయించాక మిగిలిన పాలను హైదరాబాద్‌ ప్రధాన కేంద్రానికి తరలిస్తారు.

ఖమ్మం పాడి పరిశ్రమ అభివృద్ధి పథంలో నడిచేలా యూనిట్‌ను మరింతగా ఆధునీకరించాలి. అంతే తప్ప ప్యాకింగ్‌ సెక్షన్‌ను మూసివేయటం తిరోగమన చర్యే. ఇది జరిగితే ప్రైవేట్‌ డెయిరీలకు మేలు జరుగుతుంది.

– రవికుమార్‌, పాడి రైతు, కోయచెలక

వరంగల్‌ యూనిట్‌ నుంచి పాల ప్యాకెట్లను దిగుమతి తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కాంట్రాక్టర్‌తో సంప్రదిస్తున్నాం. వరంగల్‌ నుంచి సరఫరా మొదలైతే ఖమ్మం యూనిట్‌లో ప్యాకింగ్‌ నిలిపివేయాల్సి వస్తుంది.

– కోడిరెక్క రవికుమార్‌, డీడీ, విజయ డెయిరీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement