‘ఆశ్రమ’ నిర్వహణపై కలెక్టర్‌ ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

‘ఆశ్రమ’ నిర్వహణపై కలెక్టర్‌ ఆగ్రహం

Jun 25 2026 12:06 AM | Updated on Jun 25 2026 12:06 AM

అశ్వాపురం: మండల పరిధిలోని గొందిగూడెం గిరిజన ఆశ్రమ గురుకుల బాలుర పాఠశాల నిర్వహణపై కలెక్టర్‌ అంకిత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠతో కలిసి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంప్యూటర్‌ ల్యాబ్‌, తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల, పాఠశాల ఆవరణను పరిశీలించారు. ల్యాబ్‌లో కంప్యూటర్లు దుమ్ము, ధూళితో అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్‌ తీవ్ర అసంతృవ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం పాఠశాల సందర్శన సందర్భంగా సూచనలు చేసినా పరిస్థితిలో మార్పు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత సీటీఓతో ఫోన్‌లో మాట్లాడి కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ కాంట్రాక్టును రద్దు చేయాలని ఆదేశించారు. అనంతరం వంటశాలను పరిశీలించిన మెనూ అమలు చేయడంలేదని గుర్తించారు. హాస్టల్‌ వార్డెన్‌ను వివరణ కోరారు. వసతి గృహాలను తనిఖీ చేసి, పరిశుభ్రత లోపాలను గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశుభ్రత లోపాలు, మెనూ అమలులో నిర్లక్ష్యంపై హాస్టల్‌ వార్డెన్‌కు మెమో జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం అశ్వాపురం మండలం ఎలకలగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. ఎంపీడీఓ ముత్యాలరావు, హౌసింగ్‌ ఏఈ ఉదయ్‌కుమార్‌, ఆర్‌ఐ లీలావతి, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్‌, హెచ్‌ఎం రామారావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, వార్డెన్‌కు గతంలో షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసినా తీరు మారకపోవడం గమనార్హం.

ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో అశ్వాపురం ముందంజ

అశ్వాపురం: జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే ముమ్మరంగా సాగుతోంది. సర్వేలో అశ్వాపురం మండలం ముందంజలో ఉంది. మండలంలో 3,440 ఇళ్లు ఎల్‌–1 లో ఉండగా, ఇప్పటివరకు 2076 ఇళ్ల సర్వే పూర్తయింది. ఇంకా 1,368 ఇళ్లు సర్వే చేయాల్సి ఉంది. 409 పూరి గుడిసెలను సర్వేలో గుర్తించారు. ఎంపీడీఓ ముత్యాలరావు పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది వేగవంతంగా సర్వే చేస్తుండగా, కలెక్టర్‌ అంకిత్‌ అభినందించారు.

పాలిటెక్నిక్‌ కళాశాలకు రూ.1.45 లక్షల నిధులు

మణుగూరు రూరల్‌: మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల అభివృద్ధికి సీఎస్సార్‌ నిధుల నుంచి రూ.1.45లక్షల చెక్కును భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ సీఈ బి.బిచ్చన్న బుధవారం కలెక్టర్‌ అంకిత్‌కు కలెక్టరేట్‌లో అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అభినందించారు. సీపీఓ సంజీవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వార్డెన్‌కు షోకాజ్‌ నోటీస్‌

జారీ చేయాలని ఆదేశం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement