మైనర్‌ వివాహం అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

మైనర్‌ వివాహం అడ్డగింత

Jun 25 2026 12:06 AM | Updated on Jun 25 2026 12:06 AM

జూలూరుపాడు: మండలంలోని మాచినేనిపేట గ్రామ పంచాయతీ వాగొడ్డుతండాలో ఓ మైనర్‌ బాలికకు వివాహం నిశ్చయించగా, బుధవారం అధికారులు అడ్డుకున్నారు. వాగొడ్డుతండాకు చెందిన బాలికతో టేకులపల్లి మండలానికి చెందిన ఓ యువకుడికి వివాహం నిశ్చయమైంది. గురువారం రాత్రి వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేసుకున్నాయి. బాలికకు 18 సంవత్సరాలు నిండకుండానే వివాహం చేస్తున్నారని జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ అధికారులకు సమాచారం అందగా, పోలీసులతో వెళ్లి కుటుంబీకులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 18 ఏళ్లు నిండాకే పెళ్లి చేస్తామని బాలికల తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం తీసుకున్నారు. జిల్లా చైల్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ సోషల్‌ వర్కర్‌ భారతి, జూలూరుపాడు ఎస్సై ఎన్‌.జీనత్‌ కుమార్‌, కొమ్ముగూడెం ఐసీడీఎస్‌ సెక్టారు సూపర్‌వైజర్‌ దీప, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆటో డ్రైవర్‌ నిజాయితీ

ఇల్లెందు: దొరికిన నగదు, ఏటీఎం కార్డును తిరిగి అప్పగించి ఓ ఆటోడ్రైవర్‌ నిజాయితీ చాటుకున్నాడు. పట్టణంలోని కళాసీబస్తీకి చెందిన ఆటో డ్రైవర్‌ పిల్లి మల్లేష్‌ బంక్‌లో పెట్రోల్‌ కొట్టించుకుని వస్తుండగా సమీపంలో ఓ ఏటీఎం కార్డు, రూ. 15 వేల నగదు దొరికాయి. ఈ విషయం కార్మిక నాయకుడు యాకుబ్‌షావళికి తెలిపి ఇద్దరు కలిసి బంక్‌ వద్దకు వెళ్లారు. అప్పటికే పెట్రోల్‌ బంక్‌ మేనేజర్‌ ముత్యాల నరేష్‌ తన వేతనం డబ్బులు, ఏటీఎం కార్డు పోయిందని ఆవేదన చెందుతున్నాడు. దీంతో నగదును బాధితుడికి అప్పగించగా, ఆటో డ్రైవర్‌ను పలువురు అభినందించారు.

నాలుగు ఇసుక ట్రాక్టర్ల సీజ్‌

తిరుమలాయపాలెం: మండలంలోని ముజాహిదిపురం పరిధి పాలేరు ఏటి నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను బుధవారం పోలీసులు సీజ చేశారు. అలాగే, ట్రాక్టర్ల యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జగదీష్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement