భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామయ్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు నిర్వహించారు. అనంతరం బేడా మండపంలో స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. అలాగే, స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించాక అర్చకులు నిత్యకల్యాణం నిర్వహించారు. మంగళవారం కావడంతో అభయాంజయనేయస్వామి ఉపాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి.
స్వామి సన్నిధిలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ
శ్రీ సీతారామచంద్రస్వామిని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ.శ్రీధర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి అర్చకులు, అధికారులు సంప్రదాయరీతిలో స్వాగతం పలకగా, పూజల అనంతరం పండితులు వేదాశీర్వచనం, ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. ఆలయ ఏఈఓ శ్రవణ్‌కుమార్, జల వనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.
విధుల్లో చేరిన
డీఈఓ వాసంతి
కొత్తగూడెంఅర్బన్: జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి తిరిగి మంగళవారం విధుల్లో చేరారు. విద్యాసంవత్సరం ఆరంభానికి ముందు డీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆమె మరుసటి రోజే సెలవులో వెళ్లిన విషయం విదితమే. ఈనేపథ్యాన తిరిగి విధుల్లో చేరారు. విద్యాసంవత్సరం ఇటీవల ప్రారంభమైన దృష్ట్యా ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో నియామకాలు, ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్‌మెంట్‌తో పాటు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు నమోదయ్యేలా ఇప్పటినుంచే ప్రణాళిక రూపొందించాలని పలువురు కోరుతున్నారు.
గిరిజన యువతకు
ఉచిత నైపుణ్య శిక్షణ
భద్రాచలంటౌన్: గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు భద్రాచలంలోని వైటీసీలో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు పీఓ బి.రాహుల్ తెలిపారు. 18 – 33 ఏళ్ల వయస్సు కలిగిన ఎస్టీ అభ్యర్థులకు కంప్యూటర్, బ్యూటీషియన్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజన, వసతి కల్పించడమే కాక అనంతరం సర్టిఫికెట్లు జారీ చేసి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు జూలై 6వ తేదీలోగా కావాల్సిన సామగ్రితో నేరుగా వైటీసీ కేంద్రానికి రావాలని, వివరాలకు 79931 02529 నంబర్‌లో సంప్రదించాలని పీఓ ఓ ప్రకటనలో సూచించారు.
దేశ సమైక్యతకు
శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ కృషి
చుంచుపల్లి/పాల్వంచరూరల్: దేశ సమైక్యత, సమగ్రత కోసం అహర్నిశలు పాటుపడిన మహనీయుడు డాక్టర్ శ్యామ్‌ప్రసాద్‌ముఖర్జీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని కొత్తగూడెంలోని పార్టీ జిల్లా కార్యాలయంతో పాటు పాల్వంచలో మంగళవారం నిర్వహించారు. ఆయన చిత్రపటాల వద్ద నివాళులర్పించాక ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడిగా ఆయన జాతీయ విధానాలపై బలమైన ముద్ర వేశారని తెలిపారు. కార్యక్రమాల్లో కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, నాయకులు రాపాక రమేశ్, డాక్టర్ జాటోత్ వెంకన్ననాయక్, సముద్రాల గాయత్రి, సలీం, పైడిపాటి రవీందర్, నవీన్, బలగం శ్రీధర్, రేపాక రమేశ్, రామారావు, భీమల్ జైన్‌కుమార్, జె.మోహన్‌కృష్ణ పాల్గొన్నారు.


