ప్రభుత్వానికి కౌంట్‌ డౌన్‌ మొదలైంది.. | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి కౌంట్‌ డౌన్‌ మొదలైంది..

Jun 24 2026 12:05 AM | Updated on Jun 24 2026 12:05 AM

● ఖజానాలో నిధులు ఉన్నా సీఎం రేవంత్‌కు మనసు లేదు ● కాంగ్రెస్‌కు ఓటేసి ప్రజలు మోసపోయారు ● అశ్వారావుపేటలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

● ఖజానాలో నిధులు ఉన్నా సీఎం రేవంత్‌కు మనసు లేదు ● కాంగ్రెస్‌కు ఓటేసి ప్రజలు మోసపోయారు ● అశ్వారావుపేటలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

అశ్వారావుపేట: రాష్ట్రంలో రేవంత్‌ ప్రభుత్వానికి కౌంట్‌ డౌన్‌ మొదలైందని, వచ్చేది బీఆర్‌ఎస్‌ సర్కారేనని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. అశ్వారావుపేటలో మంగళవారం ఎస్‌ఐఆర్‌పై నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బీఎల్‌ఏల సదస్సులో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదని వారు అంటున్న మాట వాస్తవమేనని.. ఎందుకంటే అచ్చంపేట నుంచి అశ్వారావుపేట వరకు ప్రజలు బీఆర్‌ఎస్‌నే కోరుకుంటున్నందన వచ్చేది తమ ప్రభుత్వమేనని తెలిపారు. గత ఎన్నికల్లో కృతజ్ఞత – ఆశకు మధ్య జరిగిన పోటీలో ఆశ గెలవగా, కేసీఆర్‌ ఎంత చేసినా కాంగ్రెస్‌ నాయకుల మోసపూరిత హామీలను నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పారు. చింతకానిలో నిర్వహించే సభకు రైతు ఆశీర్వాద సభ అని పేరు పెట్టినట్లు భట్టి విక్రమార్క ప్రకటించారని తెలిపారు. కానీ రైతులకు విద్యుత్‌ సరఫరా చేయక, ధాన్యం కొనుగోలు చేయక, సకాలంలో ఎరువులు, రైతుబంధు చెల్లించక చేసిన తప్పిదానికి రైతు క్షమాపణ సభగా మార్చాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో 80 శాతం పనులు పూర్తి చేసి, అనుమతులన్నీ తీసుకున్న సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. రైతు డిస్కం పేరుతో సోలార్‌ విద్యుత్‌ అందిస్తామని భట్టి విక్రమార్క అంటున్నారని.. రోజుకు 7 గంటలే అందుబాటులో ఉండే సోలార్‌ విద్యుత్‌ రైతాంగ అవసరాలకు ఎలా సరిపోతుందో చెప్పాలన్నారు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండీ పనులు జరగకపోగా.. రెవెన్యూ మంత్రికి రెవెన్యూ, ఆర్థిక మంత్రికి ఆదాయం పెరిగితే వ్యవసాయ మంత్రిది మరోదారి అని పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుకు చిన్నమెదడు చితికి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ఇచ్చిన రైతుబంధు కంటే మూడు రెట్ల బోనస్‌ చెల్లించినట్లు చెబుతున్నారని.. వారు రూ.3 వేల కోట్లు ఇచ్చి రైతులకు రూ.29,350 కోట్లు ఎగనామం పెట్టిన విషయం దాస్తున్నారని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement