కొత్తగూడెంఅర్బన్: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’పేరిట 99 రోజుల కార్యాచరణలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలతో మంచి ఫలితాలు వచ్చాయని జిల్లా ప్రత్యేక అధికారి, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ వెల్లడించారు. ప్రజాపాలన అమలుపై మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీఓ రాహుల్, డీఎఫ్‌ఓ కృష్ణగౌడ్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి పలు శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. అన్ని శాఖలు ప్రణాళికాయుతంగా పనిచేయడంతో విజయవంతమైందని యంత్రాంగాన్ని అభినందించారు. అయితే, దీన్ని ఆపేయకుండా నిరంతరం కొనసాగించాలని, ప్రజావాణి, గ్రామసభల ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే, సమస్యల పరిష్కారంలో ఎదురైన సవాళ్లను అధిగమించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.
11,309 దరఖాస్తుల పరిష్కారం
ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ శాఖల వారీగా కార్యక్రమాల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రజావాణి, గ్రామసభల ద్వారా అందిన 16,549 దరఖాస్తుల్లో 11,309 పరిష్కరించామని తెలిపారు. అలాగే, శాఖల వారీగా పథకాల మంజూరు, నిధుల విడుదల, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాల్లో పురోగతిని వివరించారు. అంతేకాక గండుగులపల్లి గ్రామాన్ని మోడల్ సౌరశక్తి గ్రామంగా అభివృద్ధి చేశామని తెలిపారు. అనంతరం డీఎఫ్‌ఓ కృష్ణగౌడ్, ఐటీడీఏ పీఓ రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ శాఖల పరిధిలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. దశాబ్దకాలంగా డంపింగ్‌కు నిలయమైన భద్రాచలంలోని గోదావరి నది తీర పునరుద్ధరణ కార్యక్రమం ద్వారా వ్యర్థాలు తొలగించి 10 వేల యూకలిప్టస్ మొక్కలు నాటామని తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీంద్రనాథ్, డీఆర్‌ఓ పద్మావతి, కొత్తగూడెం ఆర్‌డీఓ మధు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమీక్షలో జిల్లా ప్రత్యేక అధికారి శ్రీధర్


