పాల్వంచరూరల్: అనుమతి లేని, నకిలీ విత్తనాలను ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. మండలంలోని జగన్నాథపురం రైతు వేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన విత్తనమేళాను మంగళవారం కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన ఏడు రకాల వరి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడమే కాక రైతులకు అధికారులు ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే, నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా పర్యవేక్షించాలని తెలిపారు. రైతులు యూరియా యాప్ ద్వారా ఇంటి నుంచే బుక్ చేసుకునే అవకాశం ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలన్నారు. యాప్ వినియోగంపై అవగాహన లేకపోతే రైతువేదికల్లో ఏఈఓలు, వలంటీర్లను సంప్రదించాలని తెలిపారు. రైతు వేదికల్లోనే బోనస్ వచ్చే ఏడు రకాల వరి విత్తనాలతోపాటు మినుము, కంది, పెసర, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖాధికారి వి.బాబూరావు, ఏడీఏ సుధాకర్‌రావు, తహసీల్దార్ దారా ప్రసాద్, ఎంపీడీఓ రాజారావు, ఏఓ బి,శంకర్, సొసైటీ చైర్మన్, సీఈఓలు కొత్వాల శ్రీనివాసరావు, జి.లక్ష్మీనారాయణతో పాటు యర్రంశెట్టి ముత్తయ్య, కాంపెల్లి కనకేష్, పాపారావు, కిషన్, కొండం వెంకన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జగన్నాధపురంలో విత్తన మేళాను
ప్రారంభించిన కలెక్టర్ అంకిత్


