పాల్వంచరూరల్: మరమ్మతులు, మెయింటెనెన్స్ దృష్ట్యా మంగళవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ తోగ్గూడెం గ్రిడ్ ఈఈ నళిని తెలిపారు. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం, రథంగుట్ట వద్దనున్న ఇంటేక్ వెల్ రా వాటర్ పంపింగ్ మెయిన్ పైపులైన్ మరమ్మతులు, మొయింటనెన్స్ పనుల కారణంగా మూడు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
ఐదు నియోజకవర్గాల్లో ప్రభావం
అశ్వాపురంలోని రథంగుట్ట ఇంటేక్‌వెల్ నుంచి పాల్వంచ మండలం తోగ్గూడెం వద్దగల గ్రిడ్‌కు నిత్యం 17 కోట్ల లీటర్ల రా వాటర్ సరఫరా చేస్తారు. ఇక్కడ శుద్ధి చేశాక 13 కోట్ల లీటర్ల తాగునీటిని వివిధ గ్రామాలకు సరఫరా చేస్తారు. ఇక్కడి నుంచి సరఫరా ఆగిపోతే కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, సత్తుపల్లి, ఇల్లెందు మున్సిపాలిటీలతోపాటు పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు తాగునీరు అందదు. 23 నుంచి 25 వరకు పైపులైన్ మరమ్మతులు పూర్తిచేశాక 26న తాగునీటి సరఫరాను పునరుద్ధరించనున్నారు.
నేటి నుంచి మూడు రోజులపాటు
తాగునీటి సరఫరా నిలిపివేత


