● వేసవి దృష్ట్యా మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ ● చౌక దుకాణాల్లో ఇంకా 19,084 క్వింటాళ్ల నిల్వలు ● బియ్యం తీసుకెళ్లని పలువురు లబ్ధిదారులు
పాల్వంచరూరల్: వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల కోటా రేషన్ బియ్యాన్ని రెండు నెలల క్రితం ఒకేసారి పంపిణీ చేసింది. జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు 3,26,606 ఉండగా, 443 దుకాణాల ద్వారా ప్రతి నెలా లబ్ధిదారులకు బియ్యాన్ని అందిస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ కోటా పంపిణీ కోసం మార్చిలోనే 17 వేల 200 మెట్రిక్ టన్నులను రేషన్ దుకాణాలకు సరఫరా చేశారు. ఏప్రిల్, మే నెలల్లో రేషన్ పంపిణీ చేశారు. ఇంకా కొందరు లబ్ధిదారులు రేషన్ తీసుకోకపోవడంతో 19 వేల 84 క్వింటాళ్ల 45 కేజీలు రేషన్ దుకాణాల్లో మిగిలిపోయి ఉన్నాయి. ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కేజీల చొప్పున సన్నబియ్యం అందిస్తోంది. మూడు నెలల కోటా ముందే దుకాణాలకు పంపించినా లబ్ధిదారులు తీసుకెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా మరోవైపు జూలై కోటా 5,400 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ దుకాణాలకు తరలిస్తున్నట్లు పౌరసరఫరాల కార్పొరేషన్ డీఎం త్రినాథ్‌బాబు తెలిపారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు.
ముక్కిపోతున్న దొడ్డురకం బియ్యం
ప్రభుత్వం గతంలో రేషన్ షాపుల ద్వారా దొడ్డు రకం బియ్యం పంపిణీ చేసింది. ఏడాది కాలంగా సన్న బియ్యం అందిస్తోంది. అయితే మిగిలిపోయిన దొడ్డు రకం బియ్యం నిల్వలు ఇంకా రేషన్ షాపుల్లోనే మూలుగుతున్నాయి. తిరిగి గోదాంలకు తరలించకపోవడంతో దొడ్డు బియ్యం ముక్కి వాసన వస్తున్నాయని, పురుగు పట్టాయని డీలర్లు చెబుతున్నారు. ఈ విషయమై పౌరసరఫరాల అధికారి ప్రేమ్‌కుమార్‌ను వివరణ కోరగా.. మిగిలిన దొడ్డురకం బియ్యం విషయంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.


