కొత్తగూడెంఅర్బన్: పెండింగ్‌లో ఉన్న రెండేళ్ల పీఆర్పీ(పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే) బకాయి చెల్లించాలని కోరుతూ సింగరేణి అధికారులు సోమవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. అఖిల భారత బొగ్గు గనుల అధికారుల సంఘం(సీఎంఓఏఐ) సింగరేణి శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ 2017 వేతన సవరణ నష్టాన్ని సవరించి కోలిండియాలో అమలు చేస్తున్న పే అప్‌గ్రేడ్‌ను సింగరేణిలో కూడా అమలు చేయాలని కోరారు. పదోన్నతులు, బదిలీలు, పోస్టింగుల పాలసీని పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. సింగరేణి భవిష్యత్ దృష్ట్యా బొగ్గు బ్లాకులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతిగౌడ్, నాయకులు వెంకటాచారి, రాజ్‌గోపాల్, కేశవరావు పాల్గొన్నారు.


