ఖమ్మంలీగల్: మధిర స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్‌గా సయ్యద్ సలీం పాషా నియమితులయ్యారు. ఆయన గతంలో ఖమ్మం జిల్లా స్పెషల్ జ్యుడీడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్‌గా పనిచేశారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే ఖమ్మం స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ ఎకై ్సజ్‌గా కె.విజయలక్ష్మి నియమితులయ్యారు.
రేపు జాబ్ మేళా
ఖమ్మంరాపర్తినగర్: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 24వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఖ మ్మం జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్.మాధవి తెలిపారు. శేషసాయి ఎంటర్‌ప్రైజెస్ లో 35 ఖాళీల భర్తీకి కంపెనీ బాధ్యులు ఇంట ర్వ్యూ నిర్వహిస్తారని వెల్లడించారు. ఎస్సెస్సీ మొదలు డిగ్రీ వరకు విద్యార్హత ఉన్న వారు బు ధవారం ఖమ్మం టీటీడీసీ భవన్‌లో జరిగే జాబ్‌మేళాకు హాజరుకావాలని, వివరాలకు 90308 02174 నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.
24న బీఏఎస్ లక్కీ డ్రా
ఖమ్మంమయూరిసెంటర్: ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన కొనసాగుతున్న బీఏఎస్ పథకానికి సంబంధించి విద్యార్థుల ఎంపిక కోసం ఈ నెల 24న లక్కీ డ్రా ఏర్పాటు చేశామని ఖమ్మం ఎస్సీ డీడీ జి.జ్యోతి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ఒకటో తరగతి ప్రవేశానికి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదో తరగతి విద్యార్థుల ఎంపికకు లాటరీ తీస్తామని వెల్లడించారు. కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరు కావాలని సూచించారు.
గ్రామాల్లో పశువుల
అపహరణ
ఏజెంట్లను నియమించుకుంటున్న
నిందితులు?
ఖమ్మంరూరల్: మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న పశువుల చోరీలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గోళ్లపాడు, పోలేపల్లి, తీర్థాల తదితర ప్రాంతాల రైతులకు చెందిన సుమారు 50 పశువులు ఇటీవల చోరీ అయినట్లు తెలిసింది. వేసవి కావడంతో పశువులను రైతులు మేత కోసం అడవిలో, చేల వద్దకు వదులుతుంటారు. ఇదే అదునుగా భావించిన దొంగల ముఠా పశువులను చోరీ చేసి ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నట్లు తెలిసింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గ్రామానికి ఒకరిద్దరు ఏజెంట్లను నియమించుకుని పశువులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాక అపహరించి వాహనాల్లో హైదరాబాద్ తరలిస్తున్నట్లు సమాచారం. అక్కడ పశువుల మాంసం అమ్మే వ్యాపారులకు అమ్ముకుంటున్నారని తెలిసింది. వారం క్రితం దొంగలు నాలుగు పశువులను అపహరించి తీసుకెళ్తుండగా తీర్థాల వద్ద రైతులు అడ్డగించడంతో వారిని బుకాయించి జారుకున్నట్లు తెలిసింది. కాగా, గోళ్లపాడు రైతు మద్ది గంగిరెడ్డికి చెందిన చెందిన రూ.1.20 లక్షల విలువైన ఆవు గత నెలలో తప్పిపోవడంతో రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అలాగే మరికొందరు రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు విచారణ చేస్తున్నారని తెలిసింది.
గాలివాన బీభత్సం
ఏన్కూరు: మండలంలో సోమవారం మధ్యాహ్నం గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని తూతూకలింగన్నపేట, ఏన్కూ రు, భగవాన్‌నాయక్‌తండా, అక్కినపురంతండా, హిమామ్‌నగర్, రేపల్లెవాడలో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అలాగే, పలుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. భగవాన్‌నాయక్ తండా, అక్కినపురం తండాల్లో ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడగా, ఓ చెట్టు లారీపై పడింది. తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో ఏన్కూరు నుంచి జూలూరుపాడు మండలం వినోభానగర్ వరకు రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. జేసీబీ సాయంతో చెట్లను తొలగించి పోలీసులు రాకపోకలను పునరుద్ధరించారు. కాగా, 30 స్తంభాలు, ఎనిమిది ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరగడంతో విద్యుత్‌శాఖకు సుమారు రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని అంచనా. ఇక భగవాన్‌నాయక్ తండాలో జర్పుల సూర్య ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి.
ఆరు బయట నిద్ర..
ఇంట్లో చోరీ
కారేపల్లి: ఓ కుటుంబం ఉక్కపోత తట్టుకోలేక ఆరుబయట నిద్రిస్తుండగా, వెనక నుంచి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. కారేపల్లి బస్టాండ్ సెంటర్, డీసీసీ బ్యాంకు వెనకబజార్‌లో నివాసం ఉండే కేతిమాల సురేశ్ కుటుంబీకులు ఆదివారం రాత్రి ఆరుబయట నిద్రించారు. ఈ క్రమాన దుండగులు అర్ధరాత్రి సమయాన డీసీసీ బ్యాంకు వెనక గోడ దూకి, ఆపై సురేశ్ ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాపై ఉన్న తాళాలతో తెరిచి ఐదు తులాల బంగారు ఆభరణాలు, రెండు జతల వెండి పట్టీలు, పూజ గదిలోని కొంత నగదు చోరీ చేశారు. మొత్తంగా రూ.8 లక్షల విలువైన సొత్తు చోరీకి గురైందని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారేపల్లి ఎస్‌ఐ బి.గోపి క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.


