సేవ్ మణుగూరు పోరాటాన్ని
విజయవంతం చేయండి
కొత్తగూడెం ఎమ్మెల్యే
కూనంనేని సాంబశివరావు
మణుగూరుటౌన్: ఎంఎండీఆర్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి బొగ్గు గనులన్నీ వేలం ద్వారా ప్రైవేట్ వారికి అప్పజెప్పే కుట్ర జరుగుతోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సేవ్ మణుగూరు పోరాటానికి పిలుపునిస్తూ ఓసీ–2 డిప్‌సైడ్ బ్లాక్‌ని సింగరేణికే కేటాయించాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని కూనంనేని, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కొరిమి రాజ్‌కుమార్, మిర్యాల రంగయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎండీఆర్ చట్టానికి మద్దతు తెలిపిందని ఆ పర్యవసానమే తెలంగాణ బొగ్గు బ్లాకులు వేలానికి వచ్చాయన్నారు. మణుగూరు భవిష్యత్తుకై పీకేఓసీ–2 డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికే కేటాయించాలని, మణుగూరు ఓసీ మూసివేయకముందే ఎక్స్‌టెన్షన్ అనుమతులు తేవాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ప్రాంత కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి లేకుండా పోతోందన్నారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు సింగరేణిని రాజకీయానికి వాడుకోవడం సరికాదని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు సింగరేణి సంస్థపై చేస్తున్న ప్రచారాన్ని తప్పుబట్టారు. 140 ఏళ్ల చరిత్ర గల సింగరేణి నేడు ఇబ్బందులు ఎదుర్కొంటోందని, కేవలం రాజకీయ జోక్యం వల్ల రూ.56 వేల కోట్లు చెల్లించకపోవడంతో సింగరేణికి ఈ దుస్థితి వచ్చిందని గుర్తుచేశారు. సింగరేణికి గనులు కేటాయించకపోతే మణుగూరు ఏరియా భవిష్యత్తుతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి, మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు. తొలి రోజు దీక్షలో ఏఐటీయూసీ ఏరియా బ్రాంచ్ సెక్రటరీ వై.రాంగోపాల్, సీపీఐ పినపాక ఇన్‌చార్జ్ సరెడ్డి పుల్లారెడ్డి, నాయకులు మున్నా లక్ష్మీకుమారి, దుర్‌ాగ్యల సుధాకర్, మల్లెల రామనర్సయ్య, మేకల ఈశ్వర్‌రావు, పుల్లారావు, ఆవుల నాగరాజు, సురేందర్‌రావు, ఆదర్ల సురేందర్ తదితరులు పాల్గొనగా, శిబిరాన్ని మణుగూరుమెడికల్ షాప్ అసోసియేషన్, టీడీపీ, టీయూసీఐ నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు.


