సూపర్‌బజార్(కొత్తగూడెం): రాబోయే పల్స్ పోలియో కార్యక్రమం, స్టాప్ డయేరియా క్యాంపెయిన్, జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం అమలుపై సమీక్షించేందుకు కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాంరాథోడ్‌తోపాటు సంబంధిత శాఖల అధికారులు, టాస్క్‌ఫోర్స్ సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో జూన్ 28న నిర్వహించనున్న పల్స్‌పోలియో బూత్ డే కార్యక్రమం, అనంతరం జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటి సర్వే కార్యక్రమం, జూన్ 1 నుంచి జూలై 31 వరకు నిర్వహిస్తున్న స్టాప్ డయేరియా క్యాంపెయిన్, అలాగే జూలై 13న నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమాలను జిల్లాలో విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక, శాఖల మధ్య సమన్వయం, ప్రజల్లో అవగాహన కల్పించడం, లబ్ధిదారులకు సేవలు అందించడం వంటి అంశాలపై చర్చించారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, జిల్లా చైల్డ్ హెల్త్ అండ్ ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రతాప్, వైద్య శాఖాధికారులు పాల్గొన్నారు.


