బూర్గంపాడు: మండలంలోని అంజనాపురం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు సపావత్ శంకర్ (45) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు. అంజనాపురం ప్రాథమిక పాఠశాల లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శంకర్ తన వ్యవసా య భూమిలో వరినారు పోసేందుకు వెళ్లి కుప్పకూలగా.. గ్రామస్తులు సీపీఆర్ చేసి, భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య శరణ్య, బాబు, పాప ఉన్నారు. పీఆర్‌టీయూ రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.
విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి
జూలూరుపాడు: మండలంలోని సూరారంలో సోమవారం విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి చెందింది. గ్రామానికి చెందిన సిద్దెబోయిన చిన్నపుల్లారావుకు చెందిన దుక్కిటెద్దు మేత కోసం పొలాల వైపు వెళ్లింది. ఓ రైతు పొలంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు పిచ్చి దొండ తీగ చుట్టుకొని పచ్చగా ఉండటంతో దాన్ని తినడానికి వెళ్లిన ఎద్దుకు షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. ఖరీఫ్ పంటల సాగు ప్రారంభంలో దుక్కిటెద్దు మృతి చెందడంతో రైతు కుటుంబం కన్నీటి పర్యంతమైంది. రూ.80వేలు నష్టం వాటిల్లిందని, పరిహారం అందించి ఆదుకోవాలని చిన్నపుల్లారావు కోరాడు.


