తల్లిదండ్రుల ఆశలే యజమానుల క్యాష్‌! | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల ఆశలే యజమానుల క్యాష్‌!

Jun 22 2026 12:42 AM | Updated on Jun 22 2026 12:42 AM

అధికారులు స్పందించాలి మోయలేని భారం

ఇదీ తల్లిదండ్రుల ఆవేదన

కొత్తగూడెంఅర్బన్‌/పాల్వంచ: సాధారణంగా ఎండలు, వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులతో ప్రజలు భయపడుతుంటారు. కానీ జూన్‌, జూలై వచ్చిందంటే ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఫీజులు ఎంత పెంచుతాయోనని తల్లిదండ్రులు వణికిపోతున్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలనే తల్లిదండ్రులను ఆశలను పాఠశాలలు, కళాశాలల యజమానులు క్యాష్‌గా మార్చుకుంటున్నారు. నిబంధనలు పాటించకుండా, ఆకర్షణీయమైన ప్రకటనలతో తల్లిదండ్రులను మభ్యపెడుతూ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. యూనిఫాం, పాఠ్యపుస్తకాల కొనుగోళ్లలో అదనంగా మరికొంత బాదుతున్నారు. ఆర్థికభారమైనా విధిలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఫీజులు చెల్లిస్తున్నారు. ఇక నిబంధనలు అమలు చేయకపోయినా విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించరు. వారితో పనిచేయించాల్సినా మంత్రులు, ఎమ్మెల్యేలు, కూడా నోరుమెదపరు. వెరసి చదువులు కొనలేక తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు.

ప్రైవేటు పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. నిబంధనలు పాటించని పాఠశాలలు, కళాశాలలపై అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. భారీ ఎత్తున పెంచిన ఫీజులను నియంత్రించాలి. చదువు పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలి. –సోమిశెట్టి భార్గవ్‌ సాయి,

యూత్‌ కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌

ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు అధికఫీజులు వసూళ్లు చేయ డం తల్లిదండ్రులకు మోయలేని భారంగా మారింది. ఈ వ్యవహారంపై విద్యాశాఖాధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వివరాలను నోటీసు బోర్డుల్లో ప్రదర్శించడం లేదు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకోవాలి. –బుర్రా వీరభద్రం, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు

కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంకాగా, ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా అరకొర వసతులతో పాఠశాలలను నడుపుతూ ఫీజులను మాత్రం అమాంతం పెంచేశారు.

పాఠశాలలు, కళాశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులతో బోధన చేపట్టడంలేదు. ఆటస్థలం, మరుగుదొడ్లు బెంచీలు తదితర సౌకర్యాలు కల్పించడం లేదు.

సుమారు 30 మంది విద్యార్థులకే పరిమితం చేయాల్సిన తరగతి గదిలో 50 మంది వరకు కూర్చొబెడుతున్నారు. అది కూడా ఇరుకు గదుల్లో.

పాఠశాలల అనుమతులకు, రెన్యూవల్‌కు నిబంధనలు పాటించడంలేదు. విద్యాశాఖ అధికారులు పాఠశాలలను ప్రత్యక్షంగా పరిశీలించకుండానే అనుమతులు జారీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

జిల్లాలో సుమారు 200 ప్రైవేటు పాఠశాలలు ఉండగా, వాటిలో ఎన్ని రెన్యూవల్‌ చేశారు, ఎన్నింటికి ఈ ఏడాది కొత్తగా అనుమతులు ఇచ్చారనే విషయం విద్యాశాఖ వెల్లడించడంలేదు.

తరగతుల వారీగా ఫీజు వివరాలు నోటీస్‌ బోర్డులో ప్రదర్శించడంలేదు. అయినా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

ఒకటో తరగతి విద్యార్థులకే రూ. 18 వేల నుంచి రూ. 20 వేల వరకు ఫీజు వసూలు చేస్తూ భారం మోపుతున్నారు.

యూనిఫాం, పాఠ్య, నోట్‌ పుస్తకాలు పాఠశాలల్లోనే కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ముందస్తుగా పుస్తకాల కోసం రూ.10 వేల వరకు, యూనిఫాం కోసం మరో రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. బయటి మార్కెట్‌లో రూ.రెండు వేలకు మించి ఉండని పుస్తకాలను ఆయా పాఠశాలల ముద్రణలు వేయించుకుని నాలుగైదు రెట్లు ధర పెంచి అమ్ముతున్నారు.

యూనిఫాం, పుస్తకాలు ప్రైవేటు పాఠశాలల్లో అమ్మకాలు జరపకూడదనే నిబంధనలు ఉన్న కూడా ఎవరూ పాటించడం లేదు.

ఐఐటీ, జేఈఈ, నీట్‌ ఫౌండేషన్‌, ఏసీ క్యాంపస్‌లు, యోగా, కరాటే, క్రీడలు, చెస్‌, డ్యాన్స్‌, మ్యూజిక్‌, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ అంటూ తల్లిదండ్రులను నమ్మిస్తున్నారు.

పాఠశాలలు, కళాశాలల ముందు ఆకట్టుకునే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలల్లో మాత్రం సరైన సౌకర్యాలు ఉండవు. ఫీజు తీసుకున్నా క్రీడల్లో శిక్షణలు ఇవ్వడం లేదు. ప్రశ్నిస్తే ఏవో సాకులు చెబుతున్నారు.

బ్రాంచ్‌లను ఏర్పాటు చేసుకుని, యాజమాన్యం అందుబాటులో ఉండకుండా భారీ ఎత్తున దోపిడికీ పాల్పడుతున్నారు.

1 నుంచి 8 తరగతి వరకు పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లలకు 25శాతం ఉచిత సీట్లు ఇవ్వాలని నిబంధనలు ఉన్నా అమలు చేయడంలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement