భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. చిత్రకూట మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం గావించి నిత్యకల్యాణం జరిపారు.
గోదారమ్మకు నదీ హారతి
గోదావరికి ఆదివారం ఘనంగా నదీ హారతి సమర్పించారు. అర్చకులు గణపతి పూజ, పూజా ద్రవ్యాలతో గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేశారు. అర్చకులు రామవజ్జుల రవికుమార్, రామాచార్యులు, తేజశర్మ, సత్య ప్రసాద్ శర్మ, సుబ్రహ్మణ్యాచార్యులు, వీరభద్ర శర్మ, అశోక్ కుమార్ శర్మ, శివ తదితరులు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరాగా ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈఓ విజయ్‌కుమార్, పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
నేడు సింగరేణి
అధికారుల ప్రదర్శన
రుద్రంపూర్: సింగరేణి అధికారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 22న కొత్తగూడెంలో నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు సింగరేణి కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.లక్ష్మీపతి గౌడ్ తెలిపారు. ఆదివారం కేసీఓఏ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్‌పీ నగదు చెల్లించాలని, వేతన సవరణ అమలు చేయాలని కోరారు. పీఆర్పీ చెల్లించకుండా ప్రభుత్వం తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సమావేశంలో నాయకులు ఎస్. వెంకటాచారి, సీహెచ్ రాజ్‌గోపాల్, ఆర్. కేశవరావు, కమలాకర్, ఎ.హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


