రెండు కేంద్రాల్లో ఎస్పీ తనిఖీ
పాల్వంచరూరల్/సూపర్‌బజార్(కొత్తగూడెం): నీట్ యూజీ–2026 రీ ఎగ్జామ్ ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 1,128 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 959 మంది హాజరయ్యారు. 169 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, 85 శాతం హాజరు నమోదైందని జిల్లా నీట్ కోఆర్డినేటర్ డాక్టర్ చింతా శారద తెలిపారు. కొత్తగూడెం సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల, రామచంద్ర డిగ్రీ కళాశాల, పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల.. మొత్తం నాలుగు కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోగా, తనిఖీ చేసిన అనంతరం లోపలకు అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్ 163సెక్షన్ అమలు చేశారు. అభ్యర్థులు కాళ్లకు బూట్లు, చేతులకు గాజులు, రిస్ట్ వాచీలు, చెవుల కమ్మలు, దిద్దులు, ఉంగరాలు వంటి వస్తువులు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. కాగా, కొత్తగూడెంలో ఇద్దరు అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా కేంద్రాలకు చేరుకోవడంతో నిర్వాహకులు పరీక్షకు అనుమతించలేదు. దీంతో నిరాశతో వెనుదిరిగారు.
సింగరేణి మహిళా కళాశాల, రామచంద్ర డిగ్రీ కళాశాల కేంద్రాల్లో ఎస్పీ రోహిత్ రాజు తనిఖీ చేశారు. మహిళా కళాశాలలో తనిఖీకి వెళ్లిన ఎస్పీ రోహిత్‌రాజును సైతం అక్కడి సిబ్బంది మెటల్ డిటెక్టర్ల సహాయంతో తనిఖీ చేశారు. పాల్వంచలోని రెండు పరీక్ష కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తదితరులు తనిఖీ నిర్వహించారు.


