రాష్ట్ర వ్యవసాయశాఖ
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
దమ్మపేట : ఎల్‌నినో కారణంగా వర్షాభావం నెలకొనే పరిస్థితి ఏర్పడిందని, రైతులు నష్టపోకుండా ఉండాలంటే పంట మార్పిడి చేసే దిశగా ఆలోచన చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆదివారం మండలంలోని మల్కారం గ్రామపంచాయతీ గుత్తావారిగూడెంలో నిర్వహించిన పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హాజరుకాగా, గిరిజన సంప్రదాయ నృత్యాలతో, డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచినా ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసమే పనిచేశానని తెలిపారు. దివంగత ఎన్టీఆర్ పెట్టిన రాజకీయ భిక్షతో నాలుగు దశాబ్దాల నుంచి అనేక ఒడిదుడుకుల మధ్య రాజకీయాల్లో కొనసాగుతున్నానని అన్నారు. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ జిల్లాలోనూ పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. మల్కారం గ్రామంలో పామాయిల్ తోటలను చూస్తే మలేషియాను చూసినట్టుగా ఉందన్నారు. పామాయిల్ తోటలో వక్క, జాజి వంటి అంతర పంటలను వేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ చిన్న, సన్న కారు రైతులు పామాయిల్ సాగుతో ఆర్థికంగా అభివృద్ధి చెందారని అన్నారు. ఆయిల్ పామ్ రైతులు కాసాని వెంకటేశ్వరరావు, మహిపాల్, అలపాటి ప్రసాద్, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, సర్పంచులు, గుత్తా రాజా, అంకత మహేశ్వరరావు, శ్రీరాముల ప్రసాద్, బుద్ధ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


