అశ్వాపురం: హైదరాబాద్‌లోని రవీంద్రభారతి లో మహతి సాహితీ కవి సంగమం 6వ వార్షికోత్సవం, కవి సమ్మేళనం–2026లో భాగంగా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన కవి శ్యామల లింగారెడ్డికి కవిశ్రీ బిరుదును ప్రదానం చేశారు. ఆదివారం ఆయన వివరాలు వెల్లడించారు. కాగా, లింగారెడ్డి రచించిన ఓ విద్యార్థి, నా కలం, ఓ మేఘమా, అన్నదాత, అమ్మ గోమాత, మంచిగా మసులుకో, పిల్లలం మేము బడి పిల్లలం, రైతన్న, సమాజమా.. లాంటివి ప్రచురితమయ్యాయి. బిరుదు అందుకున్నందుకు గాను లింగారెడ్డిని పలువురు అభినందించారు.
అశ్వారావుపేటలో
పీఆర్ డిప్యూటీ కమిషనర్
అశ్వారావుపేటరూరల్: రాష్ట్ర పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్‌వెస్లీ ఆదివారం అశ్వారావుపేట మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల పరిశీలనలో భాగంగా మండలంలోని అనంతారం, మల్లాయిగూడెం గ్రామ పంచాయతీల్లో నర్సరీలు, డంపింగ్ షెడ్‌లను పరిశీలించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల ఖర్చులు, పారిశుద్ధ్య కార్యక్రమాల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఆయన చేతుల మీదుగా మొక్కలు నాటి వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీడీ రమణ, డీఐపీఓ ప్రభాకర్, ఎంపీడీఓ రామకోటారెడ్డి, ఈజీఎస్ ఏపీఓ రామచంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు.
కామన్ స్కూల్
విద్యావిధానమే మేలు
ఖమ్మం సహకారనగర్: రాష్ట్రంలో రకరకాల పాఠశాలలు స్థాపించడం కాకుండా ఒకే విద్యావిధానం అమలు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్ కోరారు. ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 27వేల పాఠశాలలు కాకుండా 4వేల పాఠశాలలే చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పడం గర్హనీయమని పేర్కొన్నారు. ఇకనైనా 15 వేలమంది రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలు విడుదల చేయడమే కాక ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, సీపీఎస్ ఉపాధ్యాయుల డీఏఈ బకాయిలు విడుదల చేయాలని కోరారు. అనంతరం పి.నాగిరెడ్డి, టీపీటీఎఫ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి వి.మనోహర్‌రాజు మాట్లాడగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న గంధసిరి మల్లయ్యను అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ తీర్మానించారు. ప్రధాన కార్యదర్శి టి.వెంగళరావు, నాయకులు శ్యాంసుందర్, వీరబాబు, వెంకటేశ్వరరావు, ఉమాదేవి, నాగేశ్వరరావు, యాకూబ్ పాషా, కోటేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే, జిల్లా సైన్స్ అధికారిగా పనిచేసిన జగదీశ్వర్ మృతికి సంతాపం తెలిపారు.
ఐదు పోస్టాఫీసులు విలీనం
ఖమ్మంగాంధీచౌక్: ఆదాయానికి మించి నిర్వహణ వ్యయం జరుగుతున్న పోస్టాఫీసుల విలీనానికి అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఖమ్మం తపాలా డివిజన్ పరిధిలో ఐదు పోస్టాఫీసులను విలీనం చేశారు. ఈ జాబితాలో ఖమ్మం నగరంలో నాలుగు, కొత్తగూడెం టౌన్‌లో ఒక సబ్ పోస్టాఫీస్ ఉంది. ఖమ్మంలోని ట్రంక్ రోడ్, డాబాలబజార్ పోస్టాఫీసులను గాంధీచౌక్ పోస్టాఫీసులో, చర్చి రోడ్ పోస్టాఫీస్‌ను రిక్కాబజార్ (పాత బస్టాండ్ ఎదురుగా), ఎన్నెస్పీ క్యాంపు పోస్టాఫీస్‌ను ఖమ్మం హెడ్ పోస్టాఫీస్‌లలో విలీనం చేశారు. ఇక కొత్తగూడెం భజనమందిర్ ఏరియా పోస్టాఫీస్‌ను హెడ్ పోస్టాఫీస్‌లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
టిప్పర్ సీజ్
కల్లూరురూరల్: అనుమతి లేకుండా ఏపీలోని కృష్ణా జిల్లా నుంచి ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్‌ను పోలీసులు ఆదివారం సీజ్ చేశారు. ఏపీలో టన్ను రూ.600 చొప్పున ఇసుక కొను గోలు చేసి తెలంగాణలో రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు అమ్మొచ్చనే భావనతో పలువురు తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు కల్లూరు మండలం పెద్ద కోరుకొండికి ఇసుక తీసుకొచ్చిన టిప్పర్‌కు అనుమతి లేదని తేలడంతో టిప్పర్ సహా 25 టన్నుల ఇసుక సీజ్ చేయడమే కాక డ్రైవర్ నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ హరిత తెలిపారు.


