సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం నుంచి తల్లాడ మీదుగా జగ్గయ్యపేట వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించి అభివృద్ధి చేయడం అవసరమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలో రోడ్డు రవాణా, హైవేస్ కేంద్ర మంత్రి నితిన్ జైరాం గడ్కరి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేఖలు అందజేసినట్లు ఆదివారం తెలిపారు. సుమారు వంద కిలోమీటర్ల పొడవు కలిగి, కొత్తగూడెం (ఎన్‌హెచ్–30) – వైరా – జగ్గయ్యపేట (ఎన్‌హెచ్–65)లను అనుసంధానం చేసే ఈ రహదారి తెలంగాణలోని ప్రధాన పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ, గిరిజన ప్రాంతాలను కలిపే రాష్ట్ర రహదారి అని వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సింగరేణి, కేటీపీఎస్, నవభారత్, బీటీపీఎస్, హెవీ వాటర్ ప్లాంట్ లాంటి అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉండటం వల్ల ఇది ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా ఉందని, ఈ రోడ్డు పాల్వంచ, అశ్వాపురం, మణుగూరు లాంటి పారిశ్రామిక ప్రాంతాలను కలపడమే కాకుండా, పుణ్యక్షేత్రమైన భద్రాచలం చేరుకోవడానికి భక్తుల మార్గాన్ని సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. జగ్గయ్యపేట వద్ద ఎన్‌హెచ్–65కి అనుసంధానం కావడం ద్వారా ప్రధాన మార్కెట్లకు లింక్ ఏర్పడుతుందని లేఖలో వివరించారు.
హత్యకు దారితీసిన
అనుమానం
కోడి కత్తితో యువకుడి హతం
సూపర్‌బజార్(కొత్తగూడెం): టూటౌన్ పరిధిలోని చుంచుపల్లి మండలం అంబేడ్కర్‌నగర్‌లో శనివా రం అర్ధరాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. సాదం శివాజీ.. తన భార్యతో ఎనగంటి నాగరాజు(30)కు అక్రమ సంబంధం ఉందని అనుమానించి అంబేడ్కర్‌నగర్‌లో కోడికత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నాగరాజును స్థానికులు కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. టూటౌన్ ఎస్‌ఐ కె.రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకటనలకే ఉచిత ప్రయాణం
ఖమ్మంమయూరిసెంటర్: జిలాల్లో ఆదివారం జరిగిన నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని అధికారులు ప్రకటించారు. అయితే, సమన్వయ లోపమో, సమాచారం లేదో తెలియదు కానీ కొందరుడ్రైవర్ల తీరుతో విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. నీట్ రాసిన విద్యార్థులు కొందరు ఖమ్మం కొత్త బస్టాండ్‌లో సత్తుపల్లి వెళ్లే డీలక్స్ బస్సు ఎక్కారు. అయితే విద్యార్థుల వద్ద హాల్‌టికెట్లను చూసిన డ్రైవర్ అవి జిరాక్స్ కాపీలని చెబుతూ దిగాలని సూచించాడు. అవి ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నవని చెప్పినా వినకుండా విద్యార్థులను బలవంతంగా దింపినట్లు తెలిసింది. కంట్రోలర్‌లను కలిసినా డ్రైవర్ వినకపోవడంతో విద్యార్థులు మరో బస్సులో చార్జీ చెల్లించి ప్రయాణించినట్లు సమాచారం. సత్తుపల్లి డీఎం లక్ష్మీనారాయణను వివరణ కోరగా.. విద్యార్థులు త నకు ఫోన్ చేయగా, కంట్రోలర్‌ను కలవమని చెప్పానని.. తర్వాత ఎవరు ఫోన్ చేయలేదని తెలిపారు.


