బీఎల్‌ఏలు అలసత్వం వహించొద్దు | - | Sakshi
Sakshi News home page

బీఎల్‌ఏలు అలసత్వం వహించొద్దు

Jun 22 2026 12:42 AM | Updated on Jun 22 2026 12:42 AM

ఇల్లెందు: ఓటరు ప్రత్యేక సవరణ(సర్‌) కార్యక్రమంలో బీఎల్‌ఏలే కీలకమని, అలసత్వం వహిస్తే తీవ్ర నష్టం జరుగుతుందని ఎమ్మెల్సీలు, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, తాతా మధు అన్నారు. ఆదివారం ఇల్లెందులోని ఐతా ఫంక్షన్‌హాల్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. దేశంలో బీజేపీ ఏకచత్రాధిపత్యం కోసం ఎన్నికల సంఘాన్ని వాడుకుంటోందని, ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలగించి లబ్ధిపొందుతోందని ఆరోపించారు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో ఓట్లు తొలగించి అక్రమాలకు పాల్పడ్డారని, అదే తరహా కుట్రలకు తెలంగాణాలో కూడా పాల్పడి గెలుపొందాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. దొంగ ఓట్లు, డబుల్‌ ఓట్లు ఉంటే వెంటనే బీఎల్‌ఓకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇల్లెందు నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్‌ చాడ కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియపై క్షేత్ర స్థాయిలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కొందరు కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరి, అధికారంలో ఉన్న కాలంలో పదవులు అనుభవించి, ఆ తర్వాత పార్టీకి ద్రోహం చేశారని విమర్శించారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య 30 నెలల కాలంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. తొలుత ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బీఆర్‌ఎస్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు, దిండిగాల రాజేందర్‌, నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement