● కారు చెట్టును ఢీకొని దంపతులు, కుమారుడు మరణం ● ఆరు నెలల కిందట కుటుంబ పెద్ద మృతి
భద్రాచలంఅర్బన్: భద్రాచలం వెంకటేశ్వరకాలనీ మొదటి లైన్‌కు చెందిన దంపతులు వారి మూడేళ్ల కుమారుడు ములకలపల్లి మండలంలో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో కన్నుమూశారు. కాలనీకి చెందిన దూడల సాయిప్రకాష్(28), సంధ్య(25) దంపతులతో పాటు వారి చిన్న కుమారుడు మోక్షిత్(3), సాయిప్రకాష్ తల్లి జ్యోతి ములకలపల్లిలో నివసించే బాబాయి ఇంటికి భోజనానికి వెళ్లి కారులో తిరిగి వస్తున్నారు. ఈ క్రమాన వీరి కారు చెట్టును ఢీకొట్టగా సాయిప్రకాష్, సంధ్య, మోక్షిత్‌లు అక్కడికక్కడే మృతి చెందగా, జ్యోతి తీవ్రగాయాలతో పాల్వంచలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సాయిప్రకాష్ భద్రాచలం సరిహద్దున ఉన్న తోటపల్లి వాసి కాగా, సంధ్యది పురుషోత్తపట్నం. వేర్వేరు కులాలకు చెందిన వీరిద్దరు ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారు. కాగా, సాయిప్రకాష్ తండ్రి శ్రీనివాసరావు దుమ్ముగూడెం విద్యుత్ శాఖ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ ఈ ఏడాది జనవరి 1వ తేదీని గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన డిపెండెంట్‌గా ఉద్యోగం కోసం సాయిప్రకాష్ ప్రయత్నాల్లో ఉన్నాడు. అన్ని పత్రాలను భద్రాచలం విద్యుత్ శాఖ కార్యాలయంలో సమర్పించగా, పేరుకు సంబంధించి సమస్య ఉందని చెప్పడంతో అది కూడా ఇటీవల సరిచేయించాడు. ఈ క్రమాన బాబాయ్ ఇంటికి వెళ్లి వస్తూ భార్య, కుమారుడితో సహా ఆయన మృత్యువాత పడడం విషాదం నింపింది. కాగా, వీరి పెద్దకుమారుడు రిత్విక్‌ను పురుషోత్తపట్నంలోని బంధువుల ఇంట్లో వదిలి ములకలపల్లికి వెళ్లడంతో అతను ప్రమాదం బారి నుంచి బయటపడ్డాడు. ఒకే ఇంట్లో తండ్రి, కుమారుడు, కోడలు, మనవడి మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతులు అద్దెకుంటున్న ఇంటి యజమానులు తాళం వేసుకుని వెళ్లినట్లు తెలిసింది. మృతదేహాలను ఇంటికి తీసుకురావొద్దని భావించి వారు ఇలా చేసినట్లు సమాచారం.


